Kishan Reddy Fires on Indrakaran Reddy :బీఆర్ఎస్ సర్కారు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి..(Indrakaran Reddy)తన బంధువుల భూములకు అనుగుణంగా నిర్మల్ మాస్టర్‌ప్లాన్(Nirmal Mastar Plan) రూపొందించారని ఆరోపించారు.
నిర్మల్ జిల్లా ఇండస్ట్రియల్ జోన్‌ను.. మాస్టర్ ప్లాన్ పేరుతో కమర్షియల్ 220 జీఓ తీసుకొచ్చారని మండిపడ్డారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులు, బీజేపీ కార్యకర్తలపైన విచక్షణ రహితంగా లాఠీ ఛార్జ్ చేసి గాయపర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న మహేశ్వర్‌రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు డీకే అరుణ(DK Aruna) వెళితే పోలీసులు అడ్డుకున్నారన్నారు. శాంతి భద్రతలు పాటించాల్సిన పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ సర్కారు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములను అమ్ముకుంటోందని దుయ్యబట్టారు. ప్రగతిభవన్ ఆదేశాలతో వందలాది ఎకరాలు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఅర్ బంగారు తెలంగాణ చేస్తే.. ముఖ్యమంత్రి సూర్యాపేట పర్యటన సందర్భంగా ప్రజా సంఘాల నాయకులను ఎందుకు గృహనిర్బంధం చేశారని ప్రశ్నించారు.
ప్రభుత్వం పౌర హక్కులను అణిచి వేస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మి అనే గిరిజన మహిళను పోలీసులు అరెస్ట్ చేసి గాయపర్చారని మండిపడ్డారు. బీజేపీ.. బాధిత మహిళకు అండగా ఉంటుందనీ స్పష్టం చేశారు. నయా నిజాంకు మించి పరిపాలిస్తున్న కేసీఆర్ పాలనపై ప్రజలు స్పందించాలనీ విజ్ఞప్తి చేశారు.