Kishan reddy Comments on Terrorism in Hyderabad : దేశంలో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో కేంద్ర ప్రభుత్వం అణిచి వేస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో ఉగ్రవాద కదలికలను కట్టడి చేసి, ప్రపంచ దేశాలకు భారతదేశ ఔన్నత్యాన్ని చాటుతున్న గొప్ప నేత ప్రధాని నరేంద్ర మోదీ అని కొనియాడారు. కంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్ లో ఏర్పాటుచేసిన మహంకాళి సెంట్రల్ హైదరాబాద్ జిల్లాల కార్యవర్గ సమావేశానికి కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మే 30 నుంచి జూన్ 30 వరకు నెలరోజుల పాటు మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో వర్క్ షాప్ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.
బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు :ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాలలో దేశం ప్రగతి పథంలో దూసుకెళ్తోందని అన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా కేంద్ర ప్రభుత్వంపై విషం కక్కుతూ బురదజల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారని అన్నారు. జీ20 దేశాల అధినేతలతో జమ్ముకశ్మీర్లో సదస్సు నిర్వహించిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. కర్ణాటకలో పూర్తిస్థాయి మెజారిటీ వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో లుకలుకలు బయటపడడం కాంగ్రెస్ కుటుంబ పార్టీ అనే విషయానికి తార్కాణం అన్నారు.
ఇక్కడి రక్షణ వారికెంతో భరోసా :మోదీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టి తొమ్మిది సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మే30 నుంచి జూన్ 30 వరకు మహా సంపర్క్ అభియాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగుతుందని చెప్పుకొచ్చారు. ఇది ప్రజలను కలవడానికి చేపట్టిన కార్యక్రమమన్నారు. జిల్లాల, మండలాల, ప్రాంతాల వారిగా సమావేశాలు నిర్వహించాలని చెప్పుకొచ్చారు. జమ్ముకశ్మీర్లో పోలీసులు కనిపిస్తే రాళ్లతో కొట్టించే వారని, స్కూల్ పిల్లలతో రాళ్లిచ్చి కొట్టించే వారని ఇలా అనేక మంది వికలాంగులయ్యారని చెప్పుకొచ్చారు. ఇటీవల శ్రీనగర్లో జీ20 సమావేశాలు నిర్వహిస్తామంటే పాకిస్థాన్, చైనా, సిరియా లాంటి దేశాలు అది వివాదాస్పద ప్రాంతం అక్కడ అంతర్జాతీయ సదస్సులు నిర్వహించకూడదని హెచ్చరించారని చెప్పుకొచ్చారు. అమెరికా ప్రతినిధులు ఇండియాకి వచ్చినప్పుడు వంద మంది సెక్యూరిటినీ తెచ్చుకున్నారని కానీ వారి అవసరం ఇక్కడ లేకపోయిందని.. ఎందుకంటే ఎంతో రక్షణగా భారత సైనికులుండటం వారికి భరోసాగా అనిపించిందని మంత్రి చెప్పుకొచ్చారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చలే : ఈ కార్యక్రమంలో మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇవ్వలేదని, రైతు రుణమాఫీ, దళితబంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవన్నీ నెరవేర్చలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో అక్రమాలకు పాల్పడిందని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజలు ఈ కుటుంబ పాలన పోవాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. బీజేపీ ద్వారా ఒక నీతివంతమైన ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. మిగతా పార్టీల కంటే మనపై బాధ్యత ఎక్కువ ఉందని.. కష్టపడాల్సిన సమయమిదని మంత్రి బీజేపీ కార్యకర్తలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయాలని ఆయన సూచించారు. ప్రధానమంత్రి ఏ దేశానికి వెళ్లిన ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పుకొచ్చారు.
ఉగ్రవాాదాన్ని కేంద్రం ఉక్కుపాదంతో అణచివేస్తుంది: కిషన్ రెడ్డి