Kishan Reddy Comments on Congress :రాష్ట్రానికి బీజేపీ అగ్రనేతలు వరుసగా రానుండడంతో శనివారం నుంచి ఆ పార్టీ ప్రచారం హోరెత్తనుంది. తదుపరి కార్యాచరణపై ఇవాళ బీజేపీ మీడియా సెంటర్లో(Media Centre) పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొని.. రేపు జరగబోయే కార్యక్రమాల కోసం వివరించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని.. ప్రజలే మెడలు వంచి సాధించుకున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
నేడు రాష్ట్రానికి అమిత్ షా- 23 తర్వాత అగ్రనేతల విస్తృత ప్రచారం
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విస్తృతంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ప్రచారంలో భాగంగా దేశ ప్రధానిమంత్రి మోదీ(PM Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, యోగి అదిత్య నాథ్, హిమంత విశ్వ శర్మ సభల్లో పాల్గొంటారని తెలిపారు. ఇంటింటికీ వెళ్లి కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలనను ప్రజలకు తెలియజేస్తామని వివరించారు. ఎన్నికల మేనిఫెస్టో క్షేత్ర స్థాయిలోకి వెళ్లేలా కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు.
BJP Election Campaign 2023 :కాంగ్రెస్ ఎన్ని హామీలు ఇచ్చినా.. 75 ఏళ్లలో ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల్లో ఓట్లు పొందాలనే తప్ప.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చిత్తశుద్ది లేదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దోపిడీ చేసి.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాయన్నారు. తెలంగాణను ఆలస్యంగా ఇవ్వడం వల్లే ఆత్మ బలిదానాలు చేసుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం(Chidambaram) చెబుతున్నారు. తెలంగాణ ఇస్తానని వెనకడుగు వేయడంతోనే.. పన్నెండు వందల మందిని పొట్టన పెట్టుకున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.