Kishan reddy comments on CM KCR : బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేసీఆర్.... హింసను ప్రేరేపించేలా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి నిర్వహించే మీడియా సమావేశాలు వినాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని కిషన్‌రెడ్డి తెలిపారు. హుజూరాబాద్ ఫలితం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ధాన్యం సమస్య తెరమీదకి తెచ్చారని విమర్శించారు.
కేంద్రప్రభుత్వంపై సీఎ కేసీఆర్ అనేక రకాల తప్పుడు ప్రచారం, విష ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ వినాలంటేనే ప్రజలు భయపడాల్సి వస్తోంది. కొత్త కొత్త పదాలు, మాటలతో విమర్శలు చేస్తున్నారు. బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి... హింసను చెలరేగే విధంగా, ఘర్షణలు ప్రేరేపించే విధంగా రెచ్చగొట్టడం ఏ మాత్రం సమంజసం కాదు.
-కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
తెరాస విష ప్రచారం
తెరాస సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మీద సీఎం కేసీఆర్ విష ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి ఆరోపించారు. మత పరమైన హింసను భాజపా ఎక్కడ రెచ్చగొట్టలేదని అన్నారు. హింసను ప్రేరేపించే వారితో కలిసి సీఎం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని విమర్శించారు. 'సీఎం కేసీఆర్ యజ్ఞాలు చేయచ్చు కానీ... భాజపా నేతలు చేయకూడదా?' అంటూ ప్రశ్నించారు.
రైతులను తప్పుదారి పట్టించేలా... తెరాస నేతలు అనేక రకాల విష ప్రచారాలు చేస్తున్నారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ తర్వాత వచ్చే రబీ కొనుగోళ్ల కోసం ఇప్పటి నుంచే రెచ్చగొట్టేవిధంగా మాట్లాడుతున్నారు. ధాన్యంపై దృష్టి పెట్టాల్సిన రాష్ట్ర మంత్రులు దిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. హుజూరాబాద్ ఫలితాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఇలా మాట్లాడుతున్నారు.
-కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రెస్మీట్ ఇదీ చదవండి:Temperatures dropped in Hyderabad: రాబోయే రోజుల్లో చలి మరింత తీవ్రం.. హెచ్చరించిన ఐఎండీ..