Telangana Formation Day Celebrations at Golconda fort : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ తరఫున జరుగుతోన్న వేడుకలను ఆ శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఎంతోమంది తమ జీవితాలను పణంగా పెట్టారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నమస్సులు తెలియజేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం సాగించామని గుర్తు చేసిన ఆయన.. అలుపెరగని పోరాటం, అకుంఠిత దీక్షతోనే ప్రత్యేక రాష్ట్రం సాధించామన్నారు. మనసా, వాచా, కర్మణా సకల జనులు పోరాడితేనే స్వరాష్ట్రం వచ్చిందని స్పష్టం చేశారు.
Central Govt Telangana Formation Day Celebrations 2023 : ఈ సందర్భంగా తెలంగాణ కోసం అమరులైన వారిని స్మరించుకుందామని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే కేవలం ఒకరిద్దరి వల్లే తెలంగాణ రాష్ట్రం రాలేదని.. ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ మద్దతు వల్లే స్వరాష్ట్రం వచ్చిందని వివరించారు. చిన్న రాష్ట్రాల వల్లే ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని తమ పార్టీ ఉద్దేశమన్న కిషన్‌రెడ్డి.. అమరవీరుల ఆకాంక్షల మేరకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేయడం లేదని ఆరోపించారు. కుటుంబ పాలనతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి కనబడుతోందని విమర్శించారు. నేడు తెలంగాణ.. ఒక కుటుంబానికి బానిసగా మారే పరిస్థితి వచ్చిందన్న ఆయన.. లిక్కర్‌లో మాఫియా.. లీకేజీలో మాఫియా.. ప్రాజెక్టుల్లో మాఫియా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.