BJP Leaders House Arrest Hyderabad :రాష్ఠ్రంలోని పేదల సొంతింటి కలసాకారం చేస్తామన్న బీఆర్ఎస్ సర్కారు.. కోట్లు వెచ్చించి నిర్మించిన రెండుపడక గదుల ఇళ్లను పంపిణీ చేయడం లేదంటూ.. రాష్ట్ర బీజేపీ విమర్శించింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో కోట్లు వెచ్చించి నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను పరిశీలించేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలోని.. ప్రతినిధి బృందం బయలుదేరింది. ఈ నేపథ్యంలోనే దిల్లీ నుంచి వచ్చిన కిషన్‌రెడ్డితోపాటు, ఎమ్మెల్యే రఘునందన్‌రావును పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు.
Kishan Reddy Arrested :ఈ క్రమంలోనేప్రభుత్వం, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా కిషన్‌రెడ్డి, రఘునందన్ వర్షంలో రోడ్డుపై బైఠాయించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడకు చేరుకున్న రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ ఆందోళన విరమించాలని కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రిని ఎలా అడ్డుకుంటారని పోలీసులను ఆయన నిలదీశారు. అనుమతి లేకుండా ఆందోళన చేయవద్దని సీపీ చౌహాన్ సూచించారు. అనంతరం ఇరువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని.. అక్కడి నుంచి ఆయన వాహనంలోనే నాంపల్లికి తరలించారు.
అంతకుముందు బీజేపీ నేతలు బాటసింగారానికి క్షేత్రస్థాయి పరీశీలనకు వెళ్లున్నారన్న సమాచారంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. జంట నగరాల్లోని పలువురు కమలం నాయకులను, కార్యకర్తల్ని ఎక్కడిక్కడ గృహనిర్భంధం చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, డీకే అరుణ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గంగిడి మనోహర్‌రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమను.. పోలీసులు గృహ నిర్భంధం చేశారు.