Kishan Reddy Appointed Telangana BJP President : వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు.. త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. బీజేపీ జాతీయ నాయకత్వం సంస్థాగత మార్పులు చేపట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించింది. రాష్ట్రానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిగా నియమించింది. కొంతకాలంగా అధ్యక్షుడి మార్పుపై జరుగుతున్న చర్చకు ముగింపు పలికింది. బండి సంజయ్ స్థానంలో కిషన్‌రెడ్డికి సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది.
BJP Organisational Changes On Comming Elections : పార్టీ బలోపేతానికి కృషి చేసిన సంజయ్ నేతృత్వంలోనే శాసనసభ ఎన్నికలను ఎదుర్కొంటామని.. అగ్ర నాయకత్వం పలుమార్లు ప్రకటించింది.సంజయ్ అధ్యక్షుడు అయ్యాక జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 స్థానాలను కైవసం చేసుకుంది. పట్టణానికే పరిమితమైన కాషాయ పార్టీని ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో.. గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లిన ఘనత సంజయ్‌కే దక్కుతుంది. ఆయన నాయకత్వం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాకు విశ్వాసం ఉంది.
కిషన్‌రెడ్డికి రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు : ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా జన సమీకరణ, కార్యకర్తల్లో ఉత్సాహం చూసి బండికి కితాబు ఇచ్చారు. సంజయ్ పదవి కాలం ఈ ఏడాది మార్చి 11వ తేదీ నాటికి ముగిసినప్పటికి అధ్యక్షుడిగా కొనసాగించింది. 2024లో జరిగే పార్టీ సంస్థాగత ఎన్నికల వరకు అధ్యక్షుడిగా ఉంటారని.. ఆయన సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటామని అగ్ర నాయకత్వం స్పష్టం చేసింది. అయితే అకస్మాత్తుగా అధ్యక్షుడి మార్పుపై ఊహగానాలు తలెత్తడం.. వాటిని నిజం చేస్తూ జాతీయ నాయకత్వం కిషన్‌రెడ్డికి బాధ్యతలు కట్టబెట్టింది.
Etela Rajender as BJP State Election Management Committee Chairman : నాయకుల మధ్య సమన్వయమే ధ్యేయంగా ఈటల రాజేందర్‌కు బీజేపీ అధిష్ఠానం.. ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా నియమించింది. హుజురాబాద్ ఎన్నికలో విజయం సాధించిన తర్వాత ఈటల సేవల్ని ఉపయోగించుకోవడంపై కొన్ని నెలలుగా చర్చ జరుగుతోంది. పార్టీ అధ్యక్ష పదవి సహా ఇతర కీలక పదవుల అంశం చర్చకు వచ్చింది. ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని భావించిన దిల్లీ నేతలు.. రాష్ట్ర బీజేపీలో తొలిసారి ఎన్నికల నిర్వహణ కమిటీ ఏర్పాటు చేసి దీనికి ఛైర్మన్‌గా ఈటలను ప్రకటించారు. పార్టీ అగ్ర నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని.. తెలంగాణలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.