తెలంగాణ

telangana

ETV Bharat / state

యువత ఆసక్తి వల్లే విజయ పథంలో అంకుర సంస్థలు : కిషన్ రెడ్డి - G20 Summit

Startup-20 India conference in Hyderabad: జీ-20 సమావేశాలకు మన దేశం నాయకత్వం వహిస్తుండటం చాలా గర్వంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. యువతలో ఉన్న అభిరుచి, ఆసక్తి వల్లే అంకుర సంస్థలు విజయ పథంలో దూసుకెళ్తున్నాయని తెలిపారు. నేటి నుంచి హైదరాబాద్​లో రెండు రోజుల పాటు జరిగే స్టార్టప్​-20 ఇండియా సదస్సులో పాల్గొన్న ఆయన.. అంకుర సంస్థల కోసం కేంద్రం ఎన్నో విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటోందని వెల్లడించారు.

Kishan Reddy and Parameswaran Iyer
Kishan Reddy and Parameswaran Iyer

By

Published : Jan 28, 2023, 1:45 PM IST

Startup-20 India conference in Hyderabad: స్టార్టప్-20 ఇండియా సదస్సు హైదరాబాద్​లో ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న సదస్సుకు జీ-20సభ్యదేశాల ప్రతినిధులతో పాటు నీతి అయోగ్​ సీఈఓ పరమేశ్వరన్​ అయ్యర్​, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి హాజరయ్యారు. అంకుర సంస్థల అభివృద్ధి, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో సమన్వయంపై సదస్సులో చర్చించారు.

కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి జీ-20 సమావేశాలకు మన దేశం నాయకత్వం వహిస్తుండటం చాలా గర్వంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. యువతలో ఉన్న అభిరుచి, ఆసక్తి వల్లే అంకుర సంస్థలు విజయ పథంలో దూసుకెళ్తున్నాయని తెలిపారు. కొవిడ్‌ను భారత్ ఎలా ఎదుర్కుందో పొరుగు దేశాలు చూసి నేర్చుకున్నాయని చెప్పారు. అంకుర సంస్థల కోసం కేంద్రం ఎన్నో విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్న మంత్రి.. ప్రత్యేక నిధులు కేటాయించి ఇంక్యుబేటర్స్‌ను తీర్చిదిద్దిందని వెల్లడించారు. ఏడేళ్లలోనే మోదీ విజన్ వల్ల అంకుర సంస్థల్లో దేశం పోటీ పడగలిగిందని తెలిపారు. స్టార్టప్- 20 సమావేశానికి హైదరాబాద్ ఆతిథ్యమివ్వడం ఆనందంగా ఉందని కిషన్​ రెడ్డి వ్యాఖ్యానించారు.

Parameshwar Iyer speech at Startup 20 conference: కార్యక్రమంలో మాట్లాడిన పరమేశ్వరన్​ అయ్యర్​.. దేశంలో పరిశ్రమలు, ఐటీ, విద్య, వైద్య రంగాల్లో అంకుర సంస్థలు ఎక్కువగా ప్రారంభం అవుతున్నట్లు పేర్కొన్నారు. నీతీ అయోగ్ కేంద్రం, రాష్ట్రాలతోపాటు మారుమూల గ్రామాలకు కూడా ప్రాధాన్యం కల్పిస్తోందని తెలిపారు. తెలంగాణ.. దేశంలోనే యువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అభివృద్ధిలో ముందడుగు వేస్తోందని అన్నారు. దేశ వ్యాప్తంగా 69 ఇంక్యూబేషన్ సిస్టమ్స్ ఉన్నట్లు ప్రకటించిన ఆయన.. టైయర్-2, టైయర్-3 నగరాల్లో అంకుర సంస్థలు పెరుగుతున్నట్లు చెప్పారు.

"హైదరాబాద్‌ దేశంలోనే స్టార్టప్‌ రంగానికి విస్తృత అవకాశాలున్న నగరాల్లో ఒకటి. స్టార్టప్‌ రంగం అభివృద్ధిపై చర్చించడానికి ఇది సరైన ప్రదేశంగా భావిస్తున్నా. సృజనాత్మకత అనేది భారతీయ నాగరికత, సంస్కృతికి గుండెకాయ వంటిది. నీతీ ఆయోగ్‌ దేశంలో మేథోమథనానికి కేంద్రం. కేంద్ర ప్రభుత్వ పనీతీరును మెరుగుపరిచేందుకు అవసరమైన మద్ధతు, సహకారం అందించడం మా పని. అదేరీతిలో రాష్ట్రాలకూ మా సహకారం అందిస్తాం. సమాఖ్య వ్యవస్థలో దేశంలోని ప్రతీ రాష్ట్రం కీలకపాత్ర పోషిస్తోంది. యువ రాష్ట్రమైన తెలంగాణ కూడా అదేరీతిలో క్రియాశీలంగా ఉంది. నీతీ ఆయోగ్‌ రాష్ట్రాలతో కలిసి పనిచేస్తుంది. స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్న రాష్టాల్లో వాటికి అనుకూల వాతావరణం కల్పించేదుకు మద్దుతగా నిలుస్తున్నాం. ఈ విషయంలో తెలంగాణ చాలా ముందంజలో ఉంది. అయితే దేశంలో మిగతా రాష్ట్రాలక్కూడా ఇలాంటి మద్దతు ఇవ్వాల్సిన అవసరముంది."- పరమేశ్వరన్‌ అయ్యర్‌, నీతీ ఆయోగ్‌ సీఈఓ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details