తెలంగాణ

telangana

ETV Bharat / state

kharif cultivation: ఖరీఫ్‌ సాగు లక్ష్యం 1.40 కోట్ల ఎకరాలు

ప్రాజెక్టులతో సాగునీటి లభ్యత పెరుగుతుండడంతో తెలంగాణలో సాగు విస్తీర్ణం ఏటేటా గణనీయంగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా వ్యవసాయశాఖ సాగు లక్ష్యాలను పెంచుతోంది.

kharif cultivation
kharif cultivation

By

Published : Jun 10, 2021, 8:46 AM IST

గతేడాదితో పోలిస్తే ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్‌)లో పంటల సాగు విస్తీర్ణం 4.49 లక్షల ఎకరాలు పెంచాలని తాజాగా నిర్దేశించింది. గత వానాకాలంలో కోటీ 35 లక్షల 63 వేల ఎకరాల్లో పంటలు వేయగా, ఈ సీజన్‌లో కోటీ 40 లక్షల 12 వేల ఎకరాల్లో సాగు చేయించాలని పేర్కొంది. ఈ మేరకు జిల్లాలవారీగా సాగు ప్రణాళికను సిద్ధం చేసింది. దీని ప్రకారం అత్యధికంగా నల్గొండ జిల్లాలో 12.17 లక్షల ఎకరాలు (గత ఏడాది కంటే 62 వేల ఎకరాలు అధికం), అత్యల్పంగా మేడ్చల్‌ జిల్లాలో 23,173 ఎకరాల్లో పంటలు వేయాలని పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపుతామని ప్రభుత్వం చెబుతుండడంతో.. దాదాపు ప్రతి జిల్లాలో సాగు విస్తీర్ణం లక్ష్యాన్ని గతేడాదికన్నా ఎంతోకొంత పెంచారు. దీని ప్రకారం మొత్తం 10 జిల్లాల్లో 5 లక్షల ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం ఉండగా.. ఒక్క నల్గొండ జిల్లాలోనే 10 లక్షల ఎకరాలకు పైగా సాగవుతుండడం విశేషం.

పత్తికే సగానికి పైగా..

వానాకాలం పంటల్లో అత్యధికంగా 75 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని అంచనా. వరి పంట గతేడాది 53.60 లక్షల ఎకరాల్లో వేయగా ఈసారి 45 లక్షల ఎకరాలకు పరిమితం చేస్తే మేలని వ్యవసాయశాఖ భావిస్తోంది. సాగునీటి లభ్యత ఉన్న రైతులు వరి పంటకే మొగ్గుచూపుతారని, 47 లక్షల నుంచి 50 లక్షల ఎకరాలు సాగుకావచ్చని అంచనా వేస్తోంది. కంది పంటను గతేడాది 10 లక్షల ఎకరాల్లో వేయగా.. ఈసారి 20 లక్షల ఎకరాలకు పెంచాలనేది మరో లక్ష్యం. ఉత్తర తెలంగాణలో సోయాచిక్కుడు పంటను ఏటా 5 లక్షల ఎకరాలకు పైగా సాగు చేస్తారు. ఈ సీజన్‌లో రాయితీపై సోయా విత్తనాలు ఇవ్వనందున దీని సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి :Covaxin X Covishield: 'ఆ నివేదికలో అనేక లోపాలు'

ABOUT THE AUTHOR

...view details