Khammam Congress MLA Tickets Disputes: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో తొలి దఫాలో కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. సిట్టింగు స్థానాలైన మధిర, భద్రాచలం నియోజకవర్గాల నుంచి సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, పొదెం వీరయ్యల అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. మిగిలిన 8 అసెంబ్లీ స్థానాల్లో మాత్రం అభ్యర్థులను ప్రకటించలేదు. రెండో జాబితా రేపోమాపో అంటూ ప్రకటనలు వస్తుండటంతో ఆశావహులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు ఎదురుచూస్తున్నారు.
Congress Khammam MLA Tickets Issue : దఫదఫాలుగా హస్తినలో సమావేశమైన కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దాదాపు ఓ కొలిక్కి తెచ్చినట్లు తెలిసింది. ఇవాళ రెండో జాబితా వెలువడుతుందన్న ప్రచారం జోరుగా సాగుతుండగా.. ఉమ్మడి జిల్లాలో 8 స్థానాల్లో రేసు గుర్రాలెవరో తేలనుంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాలేరు నుంచి బరిలో దిగడం ఖాయమన్న ప్రచారం ఉంది. ఇప్పటికే ఇద్దరు నేతలు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక మిగిలిన 6 స్థానాల్లో అభ్యర్థుల లెక్కలు తేలాల్సి ఉంది.
ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరేసి ఆశావాహుల అభ్యర్థుల పేర్లు కేంద్ర ఎన్నికల కమిటీకి చేరినప్పటికీ.. మిగిలిన వారు సైతం సీటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సత్తుపల్లి నుంచి ఏకంగా ఐదుగురు ఆశావహుల మధ్య పోటాపోటీ నెలకొంది. ఇల్లందు, పినపాక, అశ్వారావుపేటలోనూ టికెట్ పోరు తారస్థాయికి చేరింది. కొత్తగూడెం, వైరా నియోజకవర్గాల్లోనూ ఆశావహులు పోటాపోటీగా ఉండగా.. కమ్యూనిస్టులతో పొత్తులు ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్‌కు ఎసరు పెట్టేలా ఉన్నాయన్న ఆందోళన ఆశావహుల్లో వ్యక్తమవుతోంది.
ఈ పరిణామాలతో టికెట్ ఆశిస్తున్న వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పొత్తులో భాగంగా కొత్తగూడెం సీపీఐకి కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది. జిల్లా నుంచే సీపీఎంకు ఒక స్థానం ఇవ్వాల్సి వస్తుండటంతో ఎక్కడ ఇవ్వాలన్న అంశంపై కాంగ్రెస్ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఎవరి సీటు గల్లంతవుతుందోనన్న బెంగ కాంగ్రెస్ ఆశావహుల్ని వెంటాడుతోంది.
Congress Focus on Khammam MLA Tickets: పలు నియోజకవర్గాల్లో టికెట్ల పోరు ఇప్పుడు ఖమ్మం జిల్లాలోని ముఖ్యనేతల మధ్య ప్రచ్ఛన్నయుద్ధానికి తెరలేపిందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రధానంగా వైరా, సత్తుపల్లి, ఇల్లందు, పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఆశావహ అభ్యర్థుల కన్నా ముఖ్యనేతల మధ్య పోటీ తారస్థాయికి చేరింది. జిల్లాలో సీనియర్ నేతలుగా ఉన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ కో-ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి తన అనుచరులకు టికెట్ల కోసం పట్టుబడుతున్నారు.