తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖైరతాబాద్​ వినాయకుడి నిమజ్జనానికి చకచకా ఏర్పాట్లు.. అప్పటి నుంచే శోభాయాత్ర! - khairathabad Ganesh Immersion 2022

khairathabad Ganesh Immersion Arrangements: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది భక్తులు నిమజ్జన వేడుకను చూసి తరిస్తారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. రాత్రి 12 గంటలకు బొజ్జ గణపయ్యను భారీ ట్రాలీలోకి తరలించనున్నారు. అనంతరం వెల్డింగ్ పనులు ప్రారంభిస్తారు. శుక్రవారం ఉదయం 6 నుంచి 8 గంటల సమయంలో గణేశ్​ శోభాయాత్ర ప్రారంభం కానుండగా.. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల సమయంలో నిమజ్జనం పూర్తి చేయనున్నారు.

ఖైరతాబాద్​ వినాయకుడి నిమజ్జనానికి చకచకా ఏర్పాట్లు..
ఖైరతాబాద్​ వినాయకుడి నిమజ్జనానికి చకచకా ఏర్పాట్లు..

By

Published : Sep 8, 2022, 10:13 PM IST

khairathabad Ganesh Immersion Arrangements: ఖైరతాబాద్ గణనాథుడు ప్రతి ఏడాది ఒక్కో ప్రత్యేక రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఏడాది శ్రీ పంచముఖ లక్ష్మీ మహా గణపతి రూపంలో దర్శనమిచ్చారు. సుమారు మూడు నెలల పాటు మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వందల మంది కళాకారులు మహా గణపతి నిర్మాణంలో పాలుపంచుకున్నారు. శిల్పి రాజేందర్ నేతృత్వంలో గణపతిని రూపొందించారు. 30 టన్నుల ఇనుము, వెయ్యి జనపనార సంచులను ఉపయోగించి గణపయ్యను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ప్రతి ఏడాది ప్లాస్టర్​ ఆఫ్​ ప్యారిస్​ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండగా.. ఈసారి మాత్రం 50 అడుగుల ఎత్తులో మట్టి విగ్రహాన్ని రూపొందించారు. గణపయ్య బరువు 70 టన్నుల వరకు ఉంటుందని.. వర్షంలో తడిచినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు విగ్రహం తయారీ నుంచే జాగ్రత్తలు తీసుకున్నట్లు శిల్పి రాజేందర్ తెలిపారు.

మరోవైపు ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం కోసం ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మండపానికి సంబంధించిన కర్రలను తొలగించారు. సాయంత్రం సమయంలో గణపతిని కొద్దిగా కదిలించారు. రాత్రి 12 గంటలకు ప్రత్యేకంగా తీసుకువచ్చిన భారీ ట్రాలీపై గణపయ్యను ఎక్కించనున్నారు. అనంతరం విగ్రహం కదలకుండా వెల్డింగ్ పనులు చేపడతారు. భారీ గణనాథుడిని తరలించేందుకు విజయవాడకు చెందిన ప్రత్యేక శిక్షణ పొందిన డ్రైవర్​ను తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం 6 నుంచి 8 గంటల సమయంలో ప్రారంభం కానున్న గణపతి శోభాయాత్ర.. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు నిమజ్జనం పూర్తవుతుందని ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 22 క్రేన్లు ఏర్పాటు చేశారు. వ్యర్థాల వెలికితీతకు 20 జేసీబీలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. సామూహిక నిమజ్జనానికి అవసరమైన భారీ వాహనాలు, డీసీఎంలు, ట్రాలీలను మండపాల నిర్వాహకులకు రవాణా శాఖ అధికారులు సమకూర్చుతున్నారు. నెక్లెస్‌రోడ్‌లో వాహనాల పూలింగ్ కేంద్రం వద్ద ఆర్టీవో రామచంద్ర నాయక్ వాహనాలు ఇప్పించారు. నగర వ్యాప్తంగా మొత్తం 13 చోట్ల వాహనాల పూలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

మెట్రో రైళ్ల సమయం పొడిగింపు..: హైదరాబాద్‌లో గణేశ్​ శోభయాత్రను చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివస్తారు. రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణ మధ్య రైల్వే 8 ఎంఎంటీఎస్​ రైళ్లు నడుపుతుండగా.. ఆర్టీసీ 565 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మెట్రో రైళ్ల సమయం పొడిగించారు. రేపు ఉదయం 6 నుంచి అర్ధరాత్రి రాత్రి 2 వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. చివరి స్టేషన్ నుంచి అర్ధరాత్రి ఒంటిగంటకు మెట్రో బయలుదేరనుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు ప్రభుత్వం శుక్రవారం సెలవు ప్రకటించింది.

మద్యం దుకాణాలు బంద్​..: రేపు నగరంలో గణపతి నిమజ్జనం దృష్ట్యా మద్యం షాపులు మూతపడనున్నాయి. 3 కమిషనరేట్‌ల పరిధిలో రేపు ఉదయం 6 గంటల నుంచి 11వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ చూడండి..

12 వేల మంది పోలీసులు.. 22 క్రేన్లు.. గణేశ్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

'కర్తవ్యపథ్​'ను ప్రారంభించిన మోదీ.. నేతాజీ విగ్రహావిష్కరణ

ABOUT THE AUTHOR

...view details