అటవీశాఖలో క్రమంగా మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు ఎక్కువమంది మహిళలే ఉన్నారు. సర్కారీ కొలువు వచ్చిందంటే ఎగిరి గంతేస్తారు ఎవరైనా. కానీ ఆ ఉద్యోగం జీవితం అంతా జంతువుల సంరక్షణలోనూ.. వేటగాళ్లు, స్మగ్లర్లను వేటాడడంలోనూ నిమగ్నమయ్యేదని తెలిస్తే వెనకాడడం ఖాయం. అయితే విధినిర్వహణలో ఇతర కొలువుల కంటే ఎక్కువ కష్టాలున్నా అటవీశాఖలోని పలు కీలక పోస్టుల్లో మహిళలు సమర్థంగా పనిచేస్తుండడం విశేషం.
995 మంది మహిళలే
అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు (ఎఫ్‌బీఓలు) ఎంతో కీలకం. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఆక్రమణలు, స్మగ్లర్లు, అగ్నిప్రమాదాల నుంచి అడవుల్ని కాపాడాలి. వేటగాళ్ల నుంచి వన్యప్రాణుల్ని సంరక్షించాలి. తెలంగాణవ్యాప్తంగా మొత్తం 2,362 మంది ఎఫ్‌బీఓలు పనిచేస్తుంటే వారిలో 995 మంది మహిళలే. చాలామంది కొద్దినెలల క్రితం నియమితులైనవారే.
ప్రస్తుతం ఆర్.శోభ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్)గా వ్యవహరిస్తున్నారు. అటవీశాఖ చరిత్రలో పీసీసీఎఫ్‌గా మహిళా అధికారి ఉండటం ఇదే తొలిసారి. సీనియర్ ఐఏఎస్ శాంతికుమారి కొద్దిరోజుల క్రితమే అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లోకి వచ్చారు. సీఎం కేసీఆర్ ఓఎస్డీగా ‘తెలంగాణకు హరితహారం’ బాధ్యతలు చూస్తున్న ప్రియాంక వర్గీస్, చీఫ్ కన్జర్వేటర్ సునీతా భగవత్.. ఇలా పలువురు మహిళా ఐఎఫ్‌ఎస్‌లు ఉన్నారు. మెదక్, వరంగల్ రూరల్, కామారెడ్డి, మంచిర్యాల తదితర జిల్లాలకు డీఎఫ్‌ఓలుగా, హైదరాబాద్‌కు జూపార్క్‌కు క్యూరేటర్‌గా కూడా మహిళలే ఉన్నారు.
ధైర్య సాహసాలు కూడా
* పోస్టులపరంగా ఆధిపత్యమే కాదు విధినిర్వహణలో ధైర్యసాహసాలనూ చూపిస్తున్నారు మహిళా అధికారులు.
* ఆక్రమణలకు గురవుతున్న అటవీ భూముల్ని కాపాడడంలో కొత్తగూడెం జిల్లా టేకులపల్లి రేంజ్‌లో సెక్షన్ ఆఫీసర్ అఫ్సర్ ఉన్నీసా బేగం అత్యంత సాహసాన్ని ప్రదర్శిస్తున్నారు. గత నాలుగేళ్లలోనూ 558 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకోగలిగారు. ఈ క్రమంలో కళ్లల్లో కారం, మట్టిపోయడం వంటి దాడుల్ని, ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకతను ఎదురొడ్డి ధైర్యంగా నిలిచారామె. ఇప్పుడా భూమిలో మొక్కలు నాటడంతో మళ్లీ పచ్చటి అడవి పెరుగుతోంది.