Reasons Behind Telangana BJP President Change :రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించిన బండి సంజయ్.. ఎన్నికల సమయంలో పార్టీ అధ్యక్ష పదవికి దూరమయ్యారు. 2020 మార్చిలో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత.. దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికలు, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల్లో కమలం విజయం సాధించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించింది. పలు విడతలుగా ప్రజా సంగ్రామ యాత్రలు చేపట్టిన బండి సంజయ్.. భారతీయ జనతా పార్టీ పట్టణానికి పరిమితమనే వాదన నడుమ గ్రామస్థాయికి చేర్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బీజేపీ బలోపేతమైందని బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమని నేతలు విశ్వసించే స్థితికి పార్టీని చేర్చారు.
BJP Announces Kishan Reddy New Telangana President :బీజేపీ బలోపేతం, ఎన్నికల విజయాలు, జాతీయ నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాల్ని జనంలోకి తీసుకెళ్లడం వంటి సానుకూలతలు ఉన్నా.. కొన్ని అంశాలు సంజయ్‌కు ప్రతికూలంగా మారాయి. ఆయన వ్యవహారశైలిపై పార్టీ సీనియర్ నేతల్లో అసంతృప్తే ఇందుకు కారణమని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల పేరుతో అధ్యక్షుడి మార్పు చేశామని దిల్లీ నాయకులు చెబుతున్నప్పటికి.. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది.
Telangana BJP president change :జీహెచ్ఎంసీలో మంచి ఫలితాలు రాబట్టినా ఫ్లోర్ లీడర్‌ను నియమించకపోవడం.. కరీంనగర్ కార్పొరేషన్‌లో ఫ్లోర్ లీడర్‌ను పెట్టకపోవడం వంటివి బీజేపీలో చర్చనీయాంశంగా మారాయి. సీనియర్ నేతల్ని విస్మరిస్తూ ముందుకెళ్తున్నారని పార్టీలో చర్చ మొదలైంది. సంజయ్ ఒంటెద్దు పోకడలతో పార్టీకి నష్టం జరుగుతుందని కొందరు నాయకులు వాదన వినిపించారు. మునుగోడు ఉపఎన్నిక విషయంలో సంజయ్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈటల రాజేందర్, రఘునందనరావుతో సమన్వయం లేకపోవడం.. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేతపై స్పష్టత లేకపోవడం, శాసనసభలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నిక విషయంలో ఉదాసీనత.. సీనియర్ నేతల కినుకకు కారణమయ్యాయి. రాష్ట్ర పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఈటలను నియమించినా.. ఇతర పార్టీల నాయకుల్ని చేర్చుకునే విషయంలో ఆయనతో పాటు సంబంధిత జిల్లాల ప్రజా ప్రతినిధులను పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి.