TRS MPs in Parliament Sessions 2022 : ప్రతిపక్షమంటే ప్రజలు, పీడితుల గళమని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు గుర్తు చేశారు. సభలో ప్రతి సభ్యుడికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలని, నిర్దిష్ట సమయంలో వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందేనని నొక్కిచెప్పారు. రాజ్యసభ ఛైర్మన్‌గా జగదీప్ ధన్‌ఖడ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సభలో బుధవారం ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాల వాదన ద్వారా ప్రజా నాడిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దురదృష్టవశాత్తు వాటిని మనం పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. మంగళవారం ఛైర్మన్‌తో పార్టీ పక్ష నేతల భేటీలో చిన్న పార్టీలపై చర్చ సాగిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. నిస్సందేహంగా మావి చిన్న పార్టీలేనని, అదే సమయంలో చిన్న పార్టీలనే పదాన్ని నిర్వచించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
రాష్ట్రంలో విదేశీ విరాళాల లైసెన్సులు 280 రద్దు..: ఆంధ్రప్రదేశ్‌లో 2017-21 మధ్యకాలంలో 622 ఎఫ్‌సీఆర్‌ఏ (విదేశీ విరాళాల నియంత్రిత చట్టం) అనుమతుల(సర్టిఫికెట్లు)ను రద్దు చేసినట్లు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 6,677, తెలంగాణలో 280 లైసెన్సులను రద్దు చేశామన్నారు.