ప్రభుత్వం ఇప్పటి వరకు తెచ్చిన అప్పులు, ఇంకా తేవాలనుకుంటున్న రుణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. గడిచిన 4 నెలలుగా రాష్ట్ర ప్రజలు భయం గుప్పిట్లో బతుకు వెల్లదీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని భట్టి ధ్వజమెత్తారు. ప్రజలంతా భయంతో బతుకుతుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని, ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి ఫామ్ హౌస్‌కు వెళ్లారని దుయ్యబట్టారు.
కొత్త రుణాల కోసం..
ఇప్పుడున్న అప్పులు సరిపోవని.. మళ్ళీ కొత్త రుణాల కోసం తెచ్చిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ సంతకం తీసుకున్నారని మండిపడ్డారు. గడిచిన నాలుగైదు నెలల్లో మరో 30 వేలు రూ.కోట్లు అప్పులు చేశారని పేర్కొన్నారు. ఇప్పుడున్న 3 లక్షల కోట్ల అప్పును ఐదారు లక్షల కోట్ల రూపాయలకు చేరేలా రుణాలు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు.