తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజ్‌భవన్​లో గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ దూరం

KCR at Republic Day Celebrations : రాజ్​భవన్​లో జరిగే గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరుకావడం లేదని తెలిసింది. గవర్నర్​తో విభేదాల కారణంగా అక్కడికి వెళ్లేందుకు ఆయన విముఖత వ్యక్తం చేశారని సమాచారం. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

CM KCR
CM KCR

By

Published : Jan 26, 2023, 7:11 AM IST

KCR at Republic Day Celebrations : హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో జరిగే గణతంత్ర వేడుకలకు, సాయంత్రం గవర్నర్‌ ఇచ్చే విందుకు సీఎం కేసీఆర్‌ దూరంగా ఉంటారని తెలిసింది. గవర్నర్‌తో విభేదాల నేపథ్యంలో అక్కడికి వెళ్లడానికి ఆయన విముఖంగా ఉన్నట్లు సమాచారం. గణతంత్ర దినోత్సవ సందర్భంగా.. గురువారం ఉదయం ఆయన ప్రగతిభవన్‌లో జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు. అంతకు ముందు ఆయన సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో అమర జవానుల స్మారక స్తూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించనున్నారు.

ముఖ్యమంత్రి శుభాకాంక్షలు:రాష్ట్రాల సమాఖ్యగా వర్ధిల్లుతున్న భారతదేశంలో సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లుతూ, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మూలస్తంభాలుగా పాలన సాగినప్పుడు మాత్రమే దేశం మరింతగా ప్రగతి పథంలో పయనిస్తుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. పవిత్ర రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు క్షుణ్ణంగా అవగాహన చేసుకుని, ఆశయాలను సాధించేందుకు మరింతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రంలో రాజ్​భవన్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వంగా పరిస్థితులు మారాయి. ఈ క్రమంలోనే గణతంత్ర వేడుకలపై ఆసక్తి నెలకొంది. కానీ ఈ ఏడాది కూడా పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించకుండా.. రాజభవన్‌లోనే వేడుకలు జరుపుకోవాలని ప్రభుత్వం లేఖ రాసింది. కొవిడ్‌ ఉద్ధృతి కారణంగా రాజ్‌భవన్‌లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనిపై గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్​ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా పేరుతో వేడుకలు జరపకపోవడం బాధాకరమని వాపోయారు.

గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలి: గణతంత్ర ఉత్సవాలు, కవాతును ప్రభుత్వం నిర్వహించడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి కె.శ్రీనివాస్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. గతంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో దేశభక్తిని చాటేలా గణతంత్ర దినోత్సవాలు నిర్వహించిన ప్రభుత్వం.. ఈ ఏడాది విస్మరించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది నరేష్‌రెడ్డి వాదించారు. దీనిపై వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

హైకోర్టు తీర్పును స్వాగతించిన కాంగ్రెస్, బీజేపీ: పరేడ్‌తో కూడిన రిపబ్లిక్ డే జరపాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ, కాంగ్రెస్​లు స్వాగతించాయి. ఈ తీర్పు కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టు వంటివని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. రాజ్యాంగం, న్యాయస్థానాలపై కేసీఆర్‌కు గౌరవం ఉంటే.. ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను అమలు చేయాలన్నారు. స్వతంత్య్ర దినోత్సవం మాదిరిగానే జనవరి 26వ తేదీ కూడా దేశం మొత్తం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటుందని.. కానీ మన రాష్ట్రంలో మాత్రం కోవిడ్‌ సాకు చూపించి జరుపుకోకపోవడం దురదృష్టకరమని పీసీసీ సీనియార్​ ఉపాధ్యక్షుడు మల్లు రవి మండిపడ్డారు. గణతంత్ర దినోత్సవాన్ని పెరేడ్‌తో నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ స్వాగతిస్తున్నట్లు మల్లు రవి తెలిపారు.

ఇవీ చదవండి:'గణతంత్ర వేడుకలపై హైకోర్టు తీర్పు కేసీఆర్​ సర్కార్​కు చెంపపెట్టు'

హిమాచల్​లో చలి పంజా.. గడ్డకట్టిన మంచినీరు.. పైపులను మండించి సరఫరా

ABOUT THE AUTHOR

...view details