KCR will contest the upcoming Lok Sabha elections in Maharashtra : జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బీఆర్‌ఎస్ పార్టీ ప్రయత్నాలు సాగిస్తోంది. దేశంలో భారత్ రాష్ట్ర సమితి విస్తరణ కోసం పెద్ద కసరత్తే చేస్తోంది. దీనిలో భాగంగా మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ పార్టీ తమ సత్తా చాటాలనుకుంటున్నారు. రైతు ప్రభుత్వం పేరుతో మహారాష్ట్రలో ఇప్పటికే పలు బహిరంగ సభలను ఏర్పాటు చేసి తమ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సభలలో పలు నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలోకి చేరారు.
'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' అనే నినాదంతో కేసీఆర్ ప్రసంగాలు మహారాష్ట్రలో సాగాయి. పలు మహారాష్ట్ర రైతులు సైతం తెలంగాణకు వచ్చి ఇక్కడి అభివృద్ధి గురించి తెలుసుకుని వెళ్లారు. ఇది వరకు బాగానే ఉంది. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తానే స్వయంగా పోటీ చేయనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. స్వయంగా ఆయన ఈ విషయంపై ప్రకటన చేయనప్పటికీ ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీ చేస్తారనే వార్తలు ఊపందుకుంటున్నాయి.
స్వయంగా కేసీఆర్ పోటీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరఠ్వాడాలో లోక్‌సభకు పోటీ చేస్తారని పార్టీ కార్యాలయ వర్గ సమాచారం. కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ మహారాష్ట్రలో తమ అధికార బలాన్ని నిరూపించుకోవడానికి కసరత్తులు ప్రారంభించింది. పార్టీ బలాన్ని పెంచేందుకు ఆయనే స్వయంగా రాబోయే మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే సంకేతాలు వెలువడుతున్నాయి. మరఠ్వాడాలోని నాందేడ్ లేదా ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పార్టీ బలాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసం జల్లెడపడుతున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ కిసాన్ అఘాడీ రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదమ్ తెలిపారు.
రైతులే లక్ష్యంగా :నాందేడ్‌లో తొలి బహిరంగ సభ నిర్వహించి రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో పెద్దఎత్తున ప్రచారం చేసి రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని సూచించారు. నాందేడ్‌లో ఆయన చేపట్టిన బహిరంగ సభ ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. రైతు సమస్యలే లక్ష్యంగా.. కిసాన్ సర్కార్‌గా చెబుతూ వారి అభివృద్ధికై కృషి చేస్తానని.. రైతుల సమస్యలపై దృష్టి సారించి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఈయన నిర్వహించిన బహిరంగ సభకు ఛత్రపతి శంభాజీనగర్, నాందేడ్ జిల్లాల్లో వచ్చిన స్పందన చూస్తే ఈ నియోజకవర్గాలు పార్టీ ఎదుగుదలకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో స్వయంగా పార్టీ అధ్యక్షుడే పోటీ చేస్తారనే సూచన వచ్చింది.
గులాబి కండువా కప్పుకున్న పలువురు నేతలు :గత నాలుగు నెలలుగా మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ పార్టీ ఎలాంటి వ్యూహం రచించనుందనే చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో పలువురు స్థానిక నేతలను పార్టీలోకి ఆహ్వానించి గులాబి కండువా కప్పారు. ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో ఎన్సీపీ జాతీయ ఉపాధ్యక్షుడు అబ్దుల్ కదిర్ మౌలానా, కన్నడ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాదవ్, గంగాపూర్ మాజీ ఎమ్మెల్యే అన్నాసాహెబ్ మానే సహా పలువురు స్థానిక నేతలు పార్టీలో చేరి గులాబి జెండా చేతపట్టారు. దీంతో జిల్లాలో కనీసం నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాల్లో అయినా బీఆర్‌ఎస్ పార్టీ పోటీ చేస్తుందని తెలుస్తోంది.
పోటీ చేసేందుకు పార్టీ సన్నాహాలు : లోక్‌సభ ఎన్నికల్లో అన్ని నియోజక వర్గాల నుంచి పోటీ చేసేందుకు పార్టీ సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. ఈ ఎన్నికలతో బీఆర్‌ఎస్ పార్టీ తన బలాన్ని నిరూపించుకోవాలనుకుంటోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు స్వయంగా మరఠ్వాడాలోని నాందేడ్ లేదా ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లా నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని.. దానికై కసరత్తు సాగుతోందని పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదమ్ తెలిపారు. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా.. రాజకీయంగా ఈ వార్త.. పార్టీలో, తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి: