తెలంగాణ

telangana

ETV Bharat / state

త్వరలో సమగ్ర వ్యవసాయ విధానం - KCR-chaired meet favours controlled farming

హైదరాబాద్ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన వ్యవసాయంపై సుదీర్ఘ సమీక్ష జరిగింది. తెలంగాణలో అమలు చేయబోయే సమగ్ర వ్యవసాయ విధానంపై అన్ని మండలాల వ్యవసాయ విస్తరణాధికారులు, రైతుబంధుసమితి ప్రతినిధులతో దూరదృశ్యసమీక్ష ద్వారా స్వయంగా మాట్లాడతానని ముఖ్యమంత్రి వెల్లడించారు. రైతులంతా ఒకే పంట వేసి నష్టపోకుండా, ప్రభుత్వం సూచించిన పంటలే సాగు చేసే నియంత్రిత పద్ధతి వచ్చి తీరాలని అభిప్రాయపడ్డారు.

Soon a comprehensive agricultural policy
త్వరలో సమగ్ర వ్యవసాయ విధానం

By

Published : May 11, 2020, 8:53 AM IST

రైతు పండించిన పంటలకు మంచి ధర వచ్చి, కర్షకునికి మేలు జరగాలని, ప్రత్యామ్నాయ పంటలు వేసే పద్ధతిని అమలు చేయాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రగతిభవన్‌లో సీఎం అధ్యక్షతన వ్యవసాయంపై సుదీర్ఘ సమీక్ష జరిగింది. తెలంగాణలో అమలు చేయబోయే సమగ్ర వ్యవసాయ విధానంపై అన్ని మండలాల వ్యవసాయ విస్తరణాధికారులు, రైతుబంధుసమితి ప్రతినిధులతో దూరదృశ్యసమీక్ష ద్వారా స్వయంగా మాట్లాడతానని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రభుత్వం సూచించిన పంటలు వేయని రైతులకు రైతుబంధు సాయాన్ని ఆపివేయాలని, ఆ పంటలకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయవద్దని నిపుణులు సూచించారు. రైతులంతా ఒకే పంట వేసి నష్టపోకుండా, ప్రభుత్వం సూచించిన పంటలే సాగు చేసే నియంత్రిత పద్ధతి వచ్చి తీరాలని అభిప్రాయపడ్డారు.

దేశానికే ధాన్యాగారం.. తెలంగాణ

దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణ రూపొందుతోందని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో రాబోయే కాలంలో దాదాపు 90 లక్షల ఎకరాల్లో ప్రతి ఏటా వరి పండుతుందని.. రెండు కోట్ల 70 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని వెల్లడించారు. ఇంత ధాన్యాన్ని బియ్యంగా మార్చడానికి అనుగుణంగా రైస్‌ మిల్లులు తమ సామర్థ్యం పెంచుకోవాలని సూచించారు. మద్దతు ధర ఇచ్చి పంటలను కొనుగోలు చేయడమే కాకుండా, ఆ ముడి సరకును వినిమయ వస్తువుగా మార్చే బాధ్యతను కూడా తీసుకునే క్రియాశీలసంస్థగా పౌరసరఫరాల సంస్థ రూపాంతరం చెందాలని పేర్కొన్నారు.

రైతులకు మంచి ధర, వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు అందుతాయి. కల్తీలను పూర్తిగా అరికట్టవచ్చు. వ్యవసాయాధికారులు, రైతు బంధు సమితి, వ్యవసాయ యూనివర్సిటీ, పౌరసరఫరాల సంస్థ సమన్వయంతో పనిచేయాలి.. రైతులకు మేలు చేసే వ్యవసాయ విధానాన్ని అమలు చేసి చైతన్యం కలిగించాలి. - సీఎం కేసీఆర్

మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలే పండించాలి..

ఆహార అలవాట్లకు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలను మాత్రమే పండించాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. అలా చేస్తేనే మంచి ధర వస్తుందని.. ఏ రైతు ఏ పంట పండించాలో ప్రభుత్వమే తేల్చాలని పేర్కొన్నారు. వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సహకారం తీసుకోవాలని.. ఆ పంటల విత్తనాలు మాత్రమే మార్కెట్లో లభ్యమయ్యేలా చూడాలన్నారు. రైతుల్లో క్రమపద్ధతి అలవాటు కోసం కొంత కఠినంగానే వ్యవహరించాలని తెలిపారు.

లాక్‌డౌన్‌ పరిస్థితుల కారణంగా ప్రభుత్వం మానవీయ దృక్పథంతో పంటల కొనుగోళ్లు జరుపుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రతి ఏటా ఇది సాధ్యం కాదని.. తెలంగాణ వ్యాప్తంగా ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయంలో వ్యవసాయాధికారులు కొంత నిర్ధారణకు వచ్చారని వెల్లడించారు.

సీఎం సమీక్షలో ముఖ్యమైన అంశాలు

  • ఏడాదిలో రెండు పంటలకు కలిపి 80-90 లక్షల ఎకరాల్లో వరి, పత్తి 50 లక్షలు, కంది 10 లక్షలు, మక్కలు 7లక్షలు, వివిధ రకాల విత్తనోత్పత్తి 7 లక్షల ఎకరాల్లో, మిర్చి రెండున్నర లక్షలు, కూరగాయలు మూడున్నర లక్షలు, వేరుశనగ రెండున్నర లక్షలు, పసుపు 1.25 లక్షల ఎకరాల్లో, కొర్రలు, మినుములు, పెసర్లు, ఆవాలు, నువ్వులు లాంటి పంటలు మరో రెండు లక్షల ఎకరాల్లో, కొద్ది పాటి విస్తీర్ణంలో సోయాబీన్‌ పండించడం ఉత్తమం.
  • తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందించిన తెలంగాణ సోనా బియ్యం రకానికి మంచి డిమాండ్‌ ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి చాలా మంచివి. షుగర్‌ ఫ్రీ రైస్‌గా వీటిని వ్యవసాయరంగ నిపుణులు గుర్తించారు. ఈ బియ్యంలో గ్లైసమిన్‌ ఇండెక్స్‌ తక్కువ శాతం ఉంటుందని, ఇది ఆరోగ్యదాయకమని అమెరికన్‌ జర్నల్స్‌ కూడా ప్రచురించాయి. తెలంగాణ సోనాకు మంచి బ్రాండ్‌ ఇమేజి ఉంది. కాబట్టి ఈ రకాన్ని ఈ వానాకాలం సీజన్‌లోనే 10 లక్షల ఎకరాల్లో పండించాలి. దీనికి కావాల్సిన విత్తనాలను కూడా వ్యవసాయ యూనివర్సిటీ సిద్ధం చేసింది.
  • ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడటమే కాకుండా, 30-40 ఏళ్ల పాటు నిరంతరంగా దిగుబడి వచ్చే పామాయిల్‌ సాగును విస్తరించాలి. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 50 వేలు, సూర్యాపేట జిల్లాలో 10 వేల ఎకరాల్లో పండిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 5 నుంచి 10 లక్షల ఎకరాల వరకు పామాయిల్‌ సాగు చేయవచ్చు.
  • రాష్ట్రంలో వరి సాగును కూడా మార్కెట్‌ అవసరాలకు తగ్గట్టు పండించాలి. కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాలకు బాయిల్డ్‌ రైస్‌ ఎగుమతి చేయాలి కాబట్టి దొడ్డు రకాలు పండించాలి. తెలంగాణ ప్రజలు ఎక్కువగా సన్న రకాలు తింటారు. కాబట్టి వాటినీ పండించాలి. ఏవి ఏ నిష్పత్తిలో పండించాలో స్పష్టత ఉండాలి. బియ్యం గింజ పొడవు 6.2 ఎం.ఎం. ఉన్న రకాలకు విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంటుంది. కాబట్టి ఆ రకాలనూ వేయాలి.
  • రాష్ట్రంలో, దేశంలో, అంతర్జాతీయంగా మార్కెట్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి, మార్గదర్శకం చేయడానికి ఒక నిపుణుల కమిటీని నియమించాలి.

ఇదీ చూడండి:లంచం తీసుకుంటుండగా వీడియో​.. ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details