తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్ టీమ్ - kcr cabinet

తెలంగాణ మంత్రి వర్గం పాత కొత్త కలయికలతో కొలువు దీరనుంది. సీఎం కేసీఆర్​ సుదీర్ఘ కసరత్తు అనంతరం అనుభవం, సమీకరణల దృష్ట్యా నలుగురు పాత, ఆరుగురు కొత్తవారికి మంత్రులుగా అవకాశం కల్పించారు.

కేసీఆర్ టీమ్

By

Published : Feb 19, 2019, 10:25 AM IST

రెండోసారి అవకాశం దక్కించుకొన్న మంత్రులు

గుంటకండ్ల జగదీశ్ రెడ్డి

జగదీశ్ రెడ్డి

ఉద్యమ తొలినాళ్ల నుంచి గులాబీ అధినేతకు అనుంగు శిష్యునిగా ఉంటూ తనదైన పాత్ర పోషించారు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి. 2009లో హుజూర్​నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో సూర్యాపేట నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందారు. తొలి మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా తర్వాత విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖామాత్యులుగా సేవలందించారు. 2019 ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఈటల రాజేందర్

రాజేందర్

తెరాస కీలక నేతల్లో ఈటల రాజేందర్ ఒకరు. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్​ ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. 2004లో కమలాపూర్ నుంచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన ఈటల... నియోజకవర్గాల పునర్విభజన అనంతరం హుజూరాబాద్​ నుంచి వరుసగా విజయ భేరీ మోగిస్తున్నారు. ఉద్యమ సమయంలో శాసనసభ పక్షనేతగా పనిచేశారు. తెలంగాణ తొలి మంత్రి వర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ఇంద్రకరణ్ రెడ్డి

ఆదిలాబాద్​ జిల్లా రాజకీయాల్లో ఇంద్రకరణ్ రెడ్డి తనదైన ముద్ర వేసుకున్నారు. ఏపార్టీ నుంచి పోటీచేసిన విజయం సాధించడంలో ఆయన దిట్ట. 1985లో తెదేపా నుంచి రాజకీయ ఆరంగేట్రం చేశారు. జడ్పీటీసీ నుంచి మంత్రి వరకు అంచెలంచెలుగా ఎదిగారు. 1999 నుంచి నాలుగు సార్లు నిర్మల్ శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్, తెరాస ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్

తలసాని శ్రీనివాస్ యాదవ్

కార్పొరేటర్​గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్​ నగరంలో ముఖ్యనేతగా ఎదిగారు. 1994, 1999, 2008 ఉపఎన్నిల్లో సికింద్రాబాద్, 2014లో సనత్​నగర్ నుంచి తెదేపా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. అనంతరం తెరాసలో చేరి పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ, మత్స్యశాఖ బాధ్యతలు నిర్వహించారు.

కొత్త మంత్రులు

ఎర్రబెల్లి దయాకర్ రావు

దయాకర్ రావు

వరంగల్ జిల్లాలో ప్రత్యేక గుర్తింపున్న నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. తెదేపా ఆవిర్భావంతో రాజకీయ ఆరంగేట్రం చేశారు. 1994 నుంచి 2018 వరకు వర్థన్నపేట, పాలకుర్తి నుంచి ఆరుసార్లు శాసనసభ్యునిగా గెలిచారు. 1999లో శాసనసభ ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2008 ఉపఎన్నికలో వరంగల్‌ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. 2014 తర్వాత తెదేపా శాసనసభపక్ష నేతగా పనిచేసి... తెలంగాణ ఏర్పడిన తర్వాత తెరాస తీర్థం పుచ్చుకున్నారు.

కొప్పుల ఈశ్వర్

కొప్పుల ఈశ్వర్

ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెన్నంటి నడిచిన నేత కొప్పుల ఈశ్వర్. 2004లో తొలిసారి శాసనసభలో కాలుమోపిన కొప్పుల.. వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. గతసారే మంత్రి పదవి లేదా స్పీకర్ కుర్చీ ఏదో ఒకటి వస్తుందని ఆశించారు. చివరకు చీఫ్ విప్ పదవితో సరిపెట్టుకున్నారు. పార్టీలో వివాద రహితుడిగా పేరున్న నేత కావటం విశేషం.

వేముల ప్రశాంత్ రెడ్డి

ప్రశాంత్ రెడ్డి

గులాబీబాస్ ముఖ్య అనుచరునిగా పేరున్న వేముల ప్రశాంత్ రెడ్డి, 2014లో బాల్కొండ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు.

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

నిరంజన్ రెడ్డి

తెరాస వ్యవస్థాపక సభ్యుల్లో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒకరు. 2004లో కొల్లాపూర్, 2014లో వనపర్తి నుంచి అసెంబ్లీ బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. అయినా ఎక్కడ వెనకడుగు వేయలేదు. తెరాస ప్రభుత్వ ఏర్పాటు అనంతరం... సింగిరెడ్డికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారు. ఈ బాధ్యతను నిర్వహిస్తూనే... వనపర్తి నియోజవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు.

వి. శ్రీనివాస్ గౌడ్

శ్రీనివాస్ గౌడ్

తెలంగాణలో ఉద్యమంలో ఉద్యోగ సంఘాలను ఏకం చేయటంలో కీలక పాత్ర పోషించారు. 2004 నుంచి 10 వరకు తెలంగాణ గెజిటెడ్​ అధికారుల సంఘం అధ్యక్షునిగా, టీజేఏసీ కో-ఛైర్మన్​గా పనిచేశారు. 2014 మార్చి 13న ఉద్యోగం వదిలి తెరాసలో చేరారు. 2014, 2018లలో మహబూబ్​నగర్​ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

సిహెచ్​. మల్లారెడ్డి

మల్లారెడ్డి

2014లో తెదేపా ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు మల్లా రెడ్డి. అనతికాలంలోనే మల్కాజ్​గిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. తెలంగాణ నుంచి ఎన్నికైన ఏకైక తెదేపా ఎంపీగా పేరొందిన నేత. 2016లో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు.

ABOUT THE AUTHOR

...view details