KCR speech on the occasion of Sankranti festival: తెలంగాణ వ్యవసాయ రంగంలో చోటు చేసుకున్న విప్లవాత్మక ప్రగతి స్ఫూర్తితో... యావత్ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగైన రోజే భారతదేశానికి సంపూర్ణ క్రాంతి చేకూరుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకొని దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పంట పొలాల నుంచి ధాన్యపు రాశులు ఇళ్లకు చేరుకున్న శుభ సందర్భంలో రైతన్న చేసుకునే సంబురమే సంక్రాంతి అని ముఖ్యమంత్రి అన్నారు. నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలిపే రోజే పండుగని సీఎం చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ పునరుజ్జీవ కార్యాచరణతో తెలంగాణ పల్లెలు పచ్చని పంట పొలాలు, ధాన్యపు రాశులు, పాడి పశువులు, కమ్మని మట్టివాసనలతో సంక్రాంతి శోభను సంతరించుకుని వైభవోపేతంగా వెలుగొందుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయరంగం సాధించిన ప్రగతి నేడు యావత్ దేశానికి మార్గదర్శనంగా నిలిచిందని తెలిపారు. వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసే దిశగా లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటివరకు 2,16,000 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసిందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది తార్కాణమని అన్నారు.