కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో... ఈనెల 29 వరకు ఇప్పటికే లాక్‌డౌన్ పొడిగించిన ప్రభుత్వం.. సడలింపులు సహా సంబంధిత అంశాలపై ఇవాళ మధ్యంతర సమీక్ష చేపట్టనుంది. ఇందులో భాగంగా సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో.. ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమవుతారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి పరిస్థితులపై సీఎం సమీక్షిస్తారు. ప్రస్తుతం జిల్లాల్లో కొత్త కేసులు రానప్పటికీ జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి తిరిగివచ్చిన వారిలోనూ పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి, నియంత్రణా చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సహా ఇతర అంశాలపై సీఎం సమీక్షిస్తారు.
సమీక్షపై ఉత్కంఠ
రాష్ట్రంలో ఈనెల 29వరకు లాక్‌డౌన్ పొడగించినా ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేలా కేంద్రప్రభుత్వం ఇచ్చిన సడలింపుల్లో కొన్నింటిని ఇప్పటికే అమలు చేస్తున్నారు. గ్రీన్ జోన్లలో సగం సామర్థ్యంతో బస్సులు నడిపేందుకు కేంద్రం అనుమతినిచ్చినా.... రాష్ట్రంలో అనుమతి ఇవ్వలేదు. మరికొన్ని సడలింపులు సైతం ఇవ్వలేదు. నిబంధనలు తొలగించినప్పటి నుంచి ఇప్పటివరకు... ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపైనా సమీక్షలో సీఎం కేసీఆర్ చర్చిస్తారు. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో పరిస్థితులపై పూర్తిస్థాయిలో సమీక్షించి అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. లాక్‌డౌన్‌ను ఇప్పటికే 29వరకు పొడిగించినందున ఆవిషయమై సర్కార్ యధాతథ స్థితిని కొనసాగించనుంది.
రాజధానిలో కరోనా కేసులు పెరుగుతున్నందున అనుసరించాల్సిన కార్యాచరణపైనా సమావేశంలో చర్చించి ప్రణాళిక ఖరారు చేస్తారు. నగరంలో ఆంక్షలు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల నిర్వహణ సహా ఇతర సేవలకు అనుమతులపై ఇవాళ్టి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇదీ చూడండి:వైద్యులు, సామాన్యులకు డబ్ల్యూహెచ్ఓ 'యాప్' సాయం