తెలంగాణ

telangana

ETV Bharat / state

'సాగు... సంక్షేమానికే అధిక ప్రాధాన్యం'

రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ వచ్చే నెల మొదటివారంలో ఉభయసభల ముందుకు రానుంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఓటాన్ అకౌంట్ స్థానంలో పూర్తి స్థాయి బడ్జెట్ రూపకల్పనకు కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. ఆర్థికమాంద్యం ప్రభావంతో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

వచ్చే నెల మొదటివారంలో బడ్జెట్​!

By

Published : Aug 27, 2019, 5:02 AM IST

Updated : Aug 27, 2019, 8:24 AM IST

'సాగు... సంక్షేమానికే అధిక ప్రాధాన్యం'

పూర్తి స్థాయి బడ్జెట్ తయారీ కోసం ప్రభుత్వం కసరత్తు కొనసాగుతోంది. బడ్జెట్ ప్రతిపాదనలపై శనివారం సుదీర్ఘంగా సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్... సోమవారం కూడా తన కసరత్తు కొనసాగించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీనియర్ అధికారులు నర్సింగ్ రావు, రామకృష్ణారావు, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం, కేంద్రం నుంచి వచ్చిన నిధులు, పనుల్లో వాటా తదితర అంశాలపై ఆరా తీశారు. ఆర్థిక మాంద్యం ప్రభావం పడిందని అధికారులు వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో తగ్గుదలతో పాటు రాష్ట్ర ఆదాయం కూడా ఆశించినంతగా లేదని అధికారులు సమావేశంలో తెలిపినట్లు సమాచారం.

సంక్షేమం, వ్యవసాయానికే ప్రాధాన్యత:

దేశ వ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యం నెలకొని ఉందన్న సీఎం... ఆ ప్రభావం అన్ని రంగాలపై పడిందన్నారు. రాష్ట్ర ఆదాయం, అవసరాలను బేరీజు వేసుకుని బడ్జెట్ రూపకల్పన జరగాలని కేసీఆర్..​ అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూనే, ఇతర రంగాలకు అవసరమైన మేర కేటాయింపులు చేయాలని స్పష్టం చేశారు. గత మార్చిలో ఓట్ ఆన్ అకౌంట్ సమయంలో 2019-20 ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్​ను త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. బడ్జెట్ సమీక్షలో సీఎం ఆర్థికమాంద్యాన్ని ప్రస్తావించడం ద్వారా బడ్జెట్ స్వరూపానికి సంబంధించి కొంత మేర స్పష్టత వచ్చినట్లేనని భావిస్తున్నారు. ఆదాయాలు పడిపోయిన నేపథ్యంలో అంచనాలు భారీగా ఉండేందుకు ఆస్కారం లేదు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలు, హామీలకు అనుగుణంగా కేటాయింపులు చేసే అవకాశం కనిపిస్తోంది.

వినాయక చవితి తర్వాత:

బడ్జెట్ రూపకల్పనపై ఇవాళ కూడా సమీక్ష జరగనుంది. పద్దు​ తుది రూపం వచ్చాక మంత్రివర్గ ఆమోదం పొందనుంది. అనంతరం ఉభయసభల్లో ప్రవేశపెట్టేలా సీఎం ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల మొదటి వారంలో వినాయక చవితి తర్వాత బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

ఇవీ చూడండి: "ఆర్ధికమాంద్యం ప్రభావాన్ని తగ్గించేందుకు అగ్రరాజ్యాలు సమష్టిగా ముందుకెళ్లాలి"

Last Updated : Aug 27, 2019, 8:24 AM IST

ABOUT THE AUTHOR

...view details