KCR Review on Early Paddy Crop Cultivation : రాష్ట్రంలో అకాల వర్షాల ప్రభావంతో రైతాంగం నష్టపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వానాకాలం పంట సన్నద్ధతతోపాటు, వానాకాలం, యాసంగి పంట కాలాలు కుదించేందుకు సిద్ధమైంది. నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప్రధానంగా వ్యవసాయ శాఖపై విస్తృత చర్చ సాగింది. వరి పంట ముందస్తు సాగుపై చర్చలు జరిపారు.
నెల రోజుల ముందే సాగు చేసేలా :వరి పంటను నెల రోజుల ముందే సాగు చేసేలా రైతుల్లో అవగాహన కల్పించాలని.. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యాసంగి వరి నాట్లు నవంబర్ 15 నుంచి 20 వరకు సిద్ధం చేసుకునేలా చూడాలని సూచించారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పంట కాల పరిమితి కుదింపుపై.. అన్నదాతలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ముందస్తు వరి సాగుపై నిపుణులు, శాస్త్రవేత్తలు ప్రతి మంగళవారం, శుక్రవారం రైతు వేదికల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని కేసీఆర్ వివరించారు.
నవంబర్ 15 నుంచి 20 కల్లా నాట్లు వేసుకోవాలి : ముందస్తు వరి సాగుపై గ్రామ గ్రామాన రైతులకు వ్యవసాయశాఖ అధికారులు ప్రచారం కల్పించాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రతి నెల జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు సమీక్ష చేయాలని స్పష్టం చేశారు. నవంబర్ 15 నుంచి 20 కల్లా నాట్లు వేసుకోవాలని.. ఇలా అయితే మార్చి మూడో వారం నుంచి ఏప్రిల్ వారానికల్లా కోతలు కోసుకోవచ్చని వివరించారు. ఫలితంగా భారీ వర్షాలు, అకాల వానల నుంచి అన్నదాతలు బయట పడవచ్చని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.