KCR Responded on ED Notices to Kavitha: భారత రాష్ట్ర సమితి విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగా తమ పార్టీ నేతలను వేధిస్తోందన్న ఆయన.. మంత్రులు మల్లారెడ్డి, గంగుల, ఎంపీ రవిచంద్రను ఇబ్బంది పెట్టారని ఇప్పుడు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఏం జరుగుతుందో చూద్దామన్న కేసీఆర్.. ఏ చేస్తారో చేసుకోనివ్వండని అన్నట్లు సమాచారం.
ఆందోళన చెందాల్సిన, బెదరాల్సిన అవసరం లేదని నేతలకు కేసీఆర్ తెలిపారు. ప్రజాస్వామ్య, న్యాయబద్ధంగా ఎదుర్కొందామని నేతలకు సూచించారు. బీజేపీ వేధింపులు, దాడులకు భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్న ఆయన.. ఇంకా గట్టిగా పోరాటం చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీకి ఆదరణ తగ్గిందన్న సీఎం.. ఓట్లు, సీట్లు తగ్గుతున్నాయని తెలిపారు. బీజేపీని సాగనంపాల్సిందేనన్న కేసీఆర్.. ఆ ప్రక్రియలో భారత రాష్ట్ర సమితి కీలకం కావాలని నేతలకు స్పష్టం చేశారు.
"కవితను అరెస్టు చేస్తారట.. చేయనివ్వండి. ఏం చేస్తారో చూద్దాం.. భయపడే ప్రసక్తే లేదు. మంత్రులు, ఎంపీల నుంచి కవిత వరకు వచ్చారు. నోటీసుల పేరుతో పార్టీ నేతలందరినీ వేధిస్తున్నారు. కేంద్రంపై మా పోరాటం కొనసాగుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం. 99 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తాం. శాసనసభ్యులు తప్పులు చేయొద్దు. తప్పు చేసిన వారికి టికెట్లు దక్కవు."-కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి
తాను దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తానని కేసీఆర్ చెప్పారు. వివిధ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారన్న కేసీఆర్.. మంచి స్థానాలు వస్తాయని పేర్కొన్నారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో పార్టీకి 103 సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. 99 శాతం మంది సిట్టింగులకు టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
దళిత బంధు, గృహలక్ష్మి పథకాలను అత్యంత పారదర్శకంగా, కలెక్టర్ల ఆధ్వర్యంలో అమలు చేయాలని.. ప్రక్రియలో ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఉంటుందని సీఎం చెప్పారు. దళితబంధు సహా కొన్ని పథకాలకు సంబంధించి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని కొందరు ఎమ్మెల్యేలపై ఆరోపణలు ఉన్నాయని.. ఒకరిద్దరి కారణంగా పార్టీ అంతటికి చెడ్డపేరు తగదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పథకాల అమలు ప్రక్రియపై ఇంటెలిజెన్స్ నిఘా ఉందన్న సీఎం.. ఎవరైనా తప్పు చేస్తే టికెట్లు ఇవ్వబోనని హెచ్చరించారు.