చౌమహల్లా ప్యాలెస్‌లో ముకర్రం ఝా పార్థివ దేహం.. నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్ Mukarram last rites: ఎనిమిదో నిజాం ముకర్రం ఝా పార్థివ దేహం హైదరాబాద్ చేరుకుంది. ఇస్తాంబుల్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన భౌతికకాయాన్ని శంషాబాద్‌కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి చౌమహల్లా ప్యాలెస్‌కు తరలించారు. ఇవాళ నిజాం కుటుంబీకులు, బంధువులకు మాత్రమే చూసేందుకు అనుమతిచ్చారు. సీఎం కేసీఆర్ చౌమహల్లా ప్యాలెస్ వద్దకు వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ముకర్రం ఝా కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. డీజీపీ అంజనీ కుమార్, సీపీ సీవీ ఆనంద్ కూడా నివాళులు అర్పించారు.
రేపు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిజాం అభిమానులు.. ముకర్రం ఝా పార్థివదేహాన్ని చూసేందుకు అనుమతించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. చౌమహల్లా ప్యాలెస్ నుంచి మక్కామసీదు వరకు యాత్ర కొనసాగనుంది. తన పూర్వీకులైన నిజాం సమాధుల పక్కనే ముకర్రం ఝా పార్థివ దేహాన్ని ఖననం చేయనున్నారు. ఏడో నిజాం మీర్‌ఉస్మాన్ అలీఖాన్ మనవడు, చివరి నిజాం ప్రిన్స్ మీర్ అలీఖాన్ ముకర్రమ్ ఝా బహదూర్ (మీర్ బరాకత్ అలీఖాన్) (89) శనివారం అర్ధరాత్రి ఇస్తాంబుల్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
అత్యున్నత లాంఛనాలతో..:ముకర్రమ్‌ఝా మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. నిజాం వారసుడిగా, పేదల కోసం విద్యా వైద్యరంగాల్లో ఆయన చేసిన సామాజిక సేవలకు గుర్తుగా, అంత్యక్రియలను అత్యున్నతస్థాయి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌కు సీఎం సూచించారు. మరోవైపు అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వీహెచ్‌పీ డిమాండ్ చేసింది.
వారసత్వంగా ఆస్తులు.. అద్దె గదిలో మరణం..:ఉస్మాన్‌అలీఖాన్ అప్పట్లో ప్రపంచ కుబేరుడిగా గుర్తింపు పొందారు. ఆయనకు వారసుడిగా.. ముకర్రమ్‌ఝా సైతం చిన్నతనంలోనే ప్రపంచ కుబేరుడయ్యారు. అనంతరం విలాసాలకు, ఆర్భాటాలకు పోయి దివాలా తీశారు. భార్యలతో విభేదాల కారణంగా మనోవర్తి కేసులు, ఇతర ఆస్తి వివాదాలతో సతమతమయ్యారు. ఆయన సంతానం సైతం ఆస్తి కోసం కేసులు వేయడం, హైదరాబాద్‌లోని మేనత్తలు, వారి వారసులు కోర్టుకెక్కడంతో నగరంలోని ఆస్తులను అమ్మడానికి వీల్లేకుండా కోర్టు ఆంక్షలు విధించింది. దీంతో ఓ దశలో చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. చివరికి ముకర్రమ్‌ఝా ఇస్తాంబుల్‌లోని ఓ డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌కే పరిమితమయ్యారని ‘ది లాస్ట్ నిజాం.. ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ ప్రిన్స్‌లీ స్టేట్’ అనే పుస్తకంలో ఓ విదేశీ జర్నలిస్టు పేర్కొన్నాడు.
ఇవీ చదవండి: