KCR Nutrition Kit: రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కార్యక్రమాన్ని విస్తరించి.. అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే సంతంకం చేసి ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని గర్భిణీల్లో మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారిలో రక్తహీనత అధికంగా ఉందని గతంలో పలు అధ్యయనాల్లో తేలింది. గర్భిణుల్లో పోషకాహార లోపం అధిగమించేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందించాలని సర్కార్ నిర్ణయించింది.
గతేడాది డిసెంబర్‌లో కామారెడ్డి కలెక్టరేట్ వేదికగా వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీని సర్కారు ప్రారంభించింది. రక్తహీనత అధికంగా ఉన్న 9 జిల్లాల్లో తొలుత కిట్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. దాదాపు రూ.50కోట్ల ఖర్చుతో ఆదిలాబాద్, భద్రాద్రి, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ, కామారెడ్డి, కుమురం భీం, ములుగు, నాగర్‌కర్నూల్ , వికారాబాద్ జిల్లాల్లోని 1.25 లక్షల మంది గర్భిణులకు కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు.
తాజా నిర్ణయంతో మిగతా 24 జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, ఐరన్‌లను పోషకాహారం ద్వారా అందించి.. రక్తహీనత తగ్గించడం, హీమోగ్లోబిన్ శాతం పెంచడమే ఆ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలో 6.84 లక్షల మంది గర్భిణులకు 1,046 కేంద్రాల ద్వారా...13.08 లక్షల కేసీఆర్ కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.