తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇవాళ మంత్రులు, ఇంజినీర్లతో కేసీఆర్ కీలక భేటీ

కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు రైతులకు అందుతున్న తరుణంలో... గోదావరి జలాల వినియోగంపై ప్రభుత్వం దృష్టిసారించింది. వర్షాకాలంలో గోదావరి నీటి వినియోగ ప్రణాళిక రూపకల్పన కోసం సీఎం కేసీఆర్​.. నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. గోదావరి ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల మంత్రులు, ఇంజినీర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమై నీటి వినియోగ ప్రణాళికపై చర్చిస్తారు.

KCR meeting with ministers and engineers
ఇవాళ మంత్రులు, ఇంజినీర్లతో కేసీఆర్ కీలక భేటీ

By

Published : May 17, 2020, 7:33 AM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దశల వారీగా నీటిని ఎత్తిపోసే కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే 8 దశల ఎత్తిపోతల పూర్తికాగా జలాశయాలు, చెరువుల్ని కాళేశ్వరం జలాలతో నింపుతున్నారు. ఎస్సార్​ఎస్పీ సహా ఇతర ఆయకట్టు స్థిరీకరణకు ఆ నీటిని ఉపయోగిస్తున్నారు. యాసంగిలో రైతులకు ఆమేరకు ప్రయోజనం చేకూరింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలు ఇప్పటికే రంగనాయకసాగర్ జలాశయానికి చేరగా... మరో వారం, పది రోజుల్లో కొండపోచమ్మ సాగర్ జలాశయానికి చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జలాశయాల్లో నీటిని నిల్వ చేసి... కాల్వల ద్వారా గోదావరి జలాలతో చెరువులు నింపుతుండటం వల్ల వేసవిలోనూ తటాకాలు మత్తడి దూకుతున్నాయి.

గోదావరి జలాలపై..

వర్షాకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వీలైనంత ఎక్కువగా గోదావరి జలాలు ఉపయోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికల్ని వేగవంతం చేస్తోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్​.. ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. వర్షాకాలంలో గోదావరి నదీ జలాల్ని వినియోగించే ప్రణాళిక రూపకల్పన కోసం సీఎం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరగనుంది.

11 గంటలకు భేటీ

గోదావరి ప్రాజెక్టలు, పరివాహక ప్రాంతాల మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఆ సమావేశం... రోజంతా కొనసాగనుంది. గోదావరి ప్రాజెక్టుల నుంచి వర్షాకాలంలో నీటి విడుదలకు సంబంధించిన ప్రణాళిక, ఎస్సార్​ఎస్పీ, ఎల్​ఎండీ సహా మిగతా జలాశయాలకు నీటి తరలింపు, జలాల వినియోగం, తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. మంత్రులు, అధికారులు, ఇంజినీర్ల అభిప్రాయాలు తీసుకొని ముఖ్యమంత్రి నీటి వినియోగ ప్రణాళిక ఖరారు చేయనున్నారు.

ఇదీ చదవండి:శంషాబాద్​ వైపు వెళ్లిన చిరుత.. కొనసాగుతున్న వేట

ABOUT THE AUTHOR

...view details