తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం - kcr meeting about lockdown 4.0 extension

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ గడువు మే 31న ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కేసుల వ్యాప్తి తీరు దృష్ట్యా పరిమిత ఆంక్షలతో లాక్​డౌన్​ పొడిగింపును కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇవాళ మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగే సమీక్షలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంతో ఉద్యోగులకు పూర్తిస్థాయి వేతనాలు చెల్లించే విషయంపైనా స్పష్టత రానుంది.

kcr meeting on lockdown extension
నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం

By

Published : May 27, 2020, 5:20 AM IST

Updated : May 27, 2020, 7:50 AM IST

నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం

రాష్ట్రంలో లాక్‌డౌన్‌, రాత్రిపూట కర్ఫ్యూని పరిమిత ఆంక్షలతో మరికొన్ని రోజులు కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎక్కువ సడలింపులు ఇచ్చేందుకు మొగ్గు చూపుతోందని తెలిసింది. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగే సమీక్ష సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ గడువు ఈ నెల 31న ముగుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తి తీరుపై చర్చించడంతో పాటు తదుపరి కార్యాచరణపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

వ్యాధి నియంత్రణపై పూర్తిస్థాయి దృష్టి

పలు ఇతర పెద్ద నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో కేసులు తక్కువగానే ఉన్నా.. కరోనా తీవ్రత కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లాలోనూ కేసులు నమోదవుతున్నాయి. చాలా రోజుల తర్వాత మేడ్చల్‌, సూర్యాపేట, వికారాబాద్‌, నల్గొండ, నారాయణపేట జిల్లాల్లో మంగళవారం కేసులు నమోదుకావడం ఆందోళనకరంగా మారింది. ఈ పరిస్థితిలో వ్యాధి నియంత్రణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలను ప్రకటించనుంది.

ఊపందుకుంటున్న కార్యకలాపాలు

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా జోన్ల వారీగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చింది. రాష్ట్రంలో దాదాపుగా అన్ని కార్యకలాపాలు సాగుతున్నాయి. జన సంచారమూ పెరిగింది. వాహనాలు, పరిమితంగా రైళ్లు, విమానాల రాకపోకలు సాగుతున్నాయి. సినిమాల పోస్టు ప్రొడక్షన్‌కు ప్రభుత్వం సానుకూలత ప్రకటించింది. షూటింగులు జూన్‌ నుంచి సాగనున్నాయి.

నియంత్రిత సాగుపై..

నియంత్రిత సాగు విధానం పూర్తి ప్రణాళికపైనా బుధవారం సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యాచరణ మొదలైంది. వానా కాలంలో పంటల సాగు విస్తీర్ణం, విత్తనాలు, ఎరువుల పంపిణీ చర్యలను ప్రకటించనున్నారని సమాచారం. రాష్ట్ర అవతరణ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

వీటికి అనుమతుల కోసం ఒత్తిళ్లు

  • జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజు విడిచి రోజు వంటి ఆంక్షలతో నడుస్తున్న దుకాణాలను రోజూ తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి వస్తోంది.
  • హోటళ్లు, వస్త్ర దుకాణాలు, మాల్స్‌, దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఇతర ప్రార్థనా మందిరాలను తెరిచేందుకు అనుమతించాలంటూ అభ్యర్థనలు వస్తున్నాయి. వాటి విషయంలో ప్రభుత్వ వైఖరిని ఖరారు చేయాల్సి ఉంది.
  • హైదరాబాద్‌లో సిటీ బస్సు సర్వీసులు, మెట్రో రైళ్లకు అనుమతిపైనా సమాలోచనలు జరుగుతున్నాయి.
  • పదో తరగతి పరీక్షల నిర్వహణ, ఇంటర్మీడియట్‌ ఫలితాల వెల్లడిపైనా సమావేశం చర్చించనుంది.
  • ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నుంచి సగం వేతనాలే అందుతున్నాయి. కార్యాలయాల్లో అన్ని సడలింపులను ఈ నెల నుంచి ఎత్తివేసినందున ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారు. పూర్తి వేతనం ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.
Last Updated : May 27, 2020, 7:50 AM IST

ABOUT THE AUTHOR

...view details