KCR Kit Scheme Telangana : రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దవాఖానాల్లో మెరుగుపడుతున్న సౌకర్యాలు, మెరుగైన వైద్య సేవలు ఇందుకు ఓ కారణమైతే.. ప్రభుత్వం అందించే కేసీఆర్ కిట్, నగదు ప్రోత్సాహం మరో కారణమని చెప్పొచ్చు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ప్రసవించే మహిళలకు కేసీఆర్ కిట్‌క్రమం తప్పకుండా అందజేస్తున్నా.. తల్లుల ఖాతాల్లో జమ కావాల్సిన నగదు మాత్రం అందడం లేదు. దాదాపు రెండేళ్లుగా ఎంతోమంది లబ్దిదారులు ఈ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
KCR Kit Cash Assistance Telangana 2023 :ప్రసవంసమయంలో ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అయ్యే వైద్య ఖర్చులు.. పేద, మధ్య తరగతి కుటుంబాలకు కఠినంగా మారాయి. డబ్బులు లేక కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు, సరైన సమయంలో వైద్యం అందక బాలింతలు, నవజాత శిశువులు చనిపోయిన సంఘటనలూ ఉన్నాయి. ఈ సమస్యను అధిగమించడం, ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలనే సదుద్దేశంతో ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకానికి శ్రీకారం చుట్టింది.
కేసీఆర్ కిట్‌లో ఈ పిల్లల పౌడర్‌ను ఉంచాలా, వద్దా
KCR Kit Beneficiaries Waiting for Cash Assistance : బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. 2017లో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. గర్భం దాల్చిన మహిళలకు ప్రసవమై.. శిశువు పది నెలల వయసు వచ్చే వరకు సంరక్షణ చర్యలు చేపట్టడం పథకం ముఖ్య ఉద్దేశం. గర్భం దాల్చిన మహిళ ప్రసవించే సమయానికి మొత్తం 4 విడతల్లో కలిపి రూ.12 వేల నగదు, పురుడు పోసుకున్న రోజు కేసీఆర్ కిట్ (నవ జాత శిశువుకు అవసరమైన సబ్బులు, ఓ దోమ తెర, నూనెలు, రెండు బేబీ డ్రెస్సులు, చిన్న పరుపు, 2 టవళ్లు, తల్లికి 2 చీరలు,) అందిస్తోంది. ఆడబిడ్డ పుడితే మరో రూ.1000 అదనంగా (మొత్తం రూ.13 వేలు) తల్లి ఖాతాల్లో జమ చేస్తోంది.