వచ్చే ఏడాది జరగబోయే 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 259 మంది ప్రముఖులతో ఉన్నత స్థాయి జాతీయ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్య సేన్, భాజపా సీనియర్ నేత ఎల్‌కే ఆడ్వాణీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రముఖ గాయని లతా మంగేష్కర్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతోపాటు దాదాపు అందరు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, త్రివిధ దళాధిపతులు, లోక్‌సభ, రాజ్యసభల్లో వివిధ పక్షాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు స్థానం కల్పించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి
ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రుల హోదాలో కేసీఆర్, జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్ హోదాలో బండారు దత్తాత్రేయ, రాజకీయ పార్టీల నుంచి చంద్రబాబు నాయుడు, సీతారాం ఏచూరి, విభిన్న రంగాల నుంచి రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా, భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, పుల్లెల గోపీచంద్, పీవీ సింధు, మిథాలీరాజ్‌లకు స్థానం దక్కింది.