KCR PLAN: తెరాస ఎమ్మెల్యేలను ముగ్గురు వ్యక్తులు ప్రలోభాలకు గురిచేసిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు అందరి దృష్టి తెలంగాణపై కేంద్రీకృతం కావడంతో పార్టీ అధిష్ఠానం, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని వెనక జరిగిన తతంగాన్ని దిల్లీ కేంద్రంగా జాతీయ వేదికపై బహిర్గతం చేయాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. దీని కోసం ఆయన త్వరలో దిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నలుగురు ఎమ్మెల్యేలను ముగ్గురు వ్యక్తులు ప్రలోభాలకు గురిచేసే యత్నంపై కేసీఆర్ బుధవారం రాత్రి, గురువారం రోజంతా తన నివాసంలో సుదీర్ఘ సమీక్షలు నిర్వహించారు. నలుగురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, రోహిత్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డిలతో పాటు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు తదితర ముఖ్య నేతలు సమీక్షల్లో పాల్గొన్నారు.
ఈ వ్యవహారంపై పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి సమగ్ర నివేదికను తయారు చేసినట్లు తెలిసింది. ఘటనపై ముఖ్యమంత్రి గురువారం విలేకరుల సమావేశం నిర్వహిస్తారనే ప్రచారం జరిగినా ఆయన వ్యూహాత్మక మౌనం పాటించారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడం వెనక ఉన్న కీలక వ్యక్తుల తతంగాన్ని దిల్లీలో జాతీయ, అంతర్జాతీయ మీడియా ద్వారా జాతీయస్థాయిలో వెల్లడించాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. సంబంధిత కార్యాచరణపై గురువారం నేతలతో మంతనాలు సాగించారని సమాచారం. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నందున న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సంఘటనకు సంబంధించిన పక్కా సాక్ష్యాధారాలను సేకరిస్తున్నట్లు తెరాస వర్గాలు తెలిపాయి. ఆడియో, వీడియో ఫైళ్లలో నిక్షిప్తమైన సమాచారంపై ఎమ్మెల్యేలను ఆరా తీయడంతో పాటు తనకున్న విశ్వసనీయవర్గాల ద్వారా రూఢీ చేసుకునే పనిలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.