రేపటి నుంచి జరగబోయే శాసనసభ, మండలి సమావేశాలు ఈసారి వాడివేడిగా జరగనున్నాయి. రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడమే లక్ష్యంగా శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. సంబంధిత అంశాలపైనే రెండ్రోజుల పాటు చర్చసాగే అవకాశం ఉంది. జాతీయ రాజకీయాల దిశగా కేసీఆర్ అడుగుల నేపథ్యంలో తెరాస అందుకు అనుగుణంగా సభలో వాణి వినిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎండగట్టే ప్రయత్నం: రేపు, ఎల్లుండి శాసనసభ, మండలి సమావేశం కానున్నాయి. శాసనసభలో చర్చించే అంశాలకు సంబంధించి ఆయా పార్టీలు సభాపతికి ప్రతిపాదనలిచ్చాయి. సోమ, మంగళ వారాల్లో ప్రశ్నోత్తరాలు లేకుండా నేరుగా స్వల్పకాలిక చర్చను తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, వైఖరి సమావేశాల్లో చర్చకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధికి చేయూతనిస్తూ అండగా నిలవాల్సిన కేంద్రం.. పదేపదే అడ్డంకులు సృష్టిస్తోందన్న రాష్ట్రప్రభుత్వం అదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా మరోమారు బలంగా చాటాలని యత్నిస్తోంది.