భారత పరివర్తనే.. BRS మిషన్ KCR Comments on Maharashtra: మహారాష్ట్రలో త్వరలో జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికలతో బీఆర్ఎస్ రంగంలోకి దూకుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. జడ్పీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని.. ప్రతి గడపను తట్టి ప్రజలందరిని పలకరించాలని మరాఠా బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మే 7 నుంచి జూన్ 7 వరకు ప్రతి గ్రామంలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి బలోపేతం చేస్తామన్నారు.
"భారత్‌లో పరివర్తన లేకుండా సమస్యల్ని దూరం చేయలేం. ప్రస్తుతం కొనసాగుతున్న విధానాన్ని మనం చూస్తూనే ఉన్నాం. మళ్లీ అదే పద్ధతిలో కాకుండా మార్పు రావాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. నాగ్‌పూర్‌లో ఒక ఆఫీస్‌ను కొనుగోలు చేశాం. ఔరంగాబాద్‌లో కార్యాలయాన్ని కొనుగోలు చేస్తున్నాం. భారత్ పరివర్తన్ కోసం ఏర్పాటైన మిషన్ బీఆర్ఎస్. ఎప్పటివరకు మార్పురాదో అప్పటి వరకు ఈ మిషన్ కొనసాగుతూనే ఉంటుంది." - కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
బీఆర్ఎస్ ఎన్నికల కోసమో, ఎవరినో నాయకుడిని చేయాలనే లక్ష్యంతోనే ఆవిర్భవించలేదని కేసీఆర్ అన్నారు. భారత రాష్ట్ర సమితి.. భారత్ పరివర్తన్ మిషన్‌గా పని చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలు.. సాగు, తాగు నీరు, విద్యుత్ సమస్యలతో సతమతమవుతున్నాయని తెలిపారు. మహారాష్ట్రకు చెందిన పలువురు నాయకులు, ప్రజా, రైతు సంఘాల ప్రతినిధులు హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.
ప్రపంచంలోనే దర్జాగా ఉండాలి: మన దేశ రైతు ప్రపంచంలోనే దర్జాగా ఉండాలని కేసీఆర్ అన్నారు. నీటిని బంధించి, ఆనకట్టలు కట్టి.. తాగు, సాగు నీటిని అందించాలని పేర్కొన్నారు. రైతన్నలు బంగారు పంటలు పండించి.. వారి ఇళ్లలో సిరి సంపదలతో తులతూగేలా చేయాలనే లక్ష్యంతోనే బీఆర్‌ఎస్ ఆవిర్భవించిందని తెలిపారు. తెలంగాణలో ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇస్తున్నప్పుడు.. మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదని కేసీఆర్ ప్రశ్నించారు.
అవన్నీ పుకార్లు: ఎన్నో నదులున్న మహారాష్ట్రలోని ఔరంగాబాద్, అకోలాలో ఎనిమిది రోజులకోసారి తాగునీరు ఇచ్చే అగత్యం ఎందుకని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను.. మహారాష్ట్రలో అమలు చేస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని పుకార్లు పుట్టిస్తున్నారని వివరించారు. అవినీతికి పాల్పడే నాయకులు మాత్రం దివాలా తీస్తారని విమర్శించారు. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అమలు చేస్తే మధ్యప్రదేశ్‌కు వెళ్లిపోతామని చెబితే.. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫడణవీస్ నుంచి ఇప్పటివరకు సమాధానం రాలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ప్రతి ఒక్కరూ ఓ కేసీఆర్‌గా మారి:ప్రతి ఒక్కరూ కేసీఆర్‌గా మారి.. రైతు ఆత్మహత్యలు లేని మహారాష్ట్రగా తీర్చిదిద్దుకుందామని కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలో వచ్చే జడ్పీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. ప్రజలు ఓ పార్టీకి కాకపోతే మరొక పార్టీకి ఓటు వేస్తారని... కాబట్టి వాళ్ల దుకాణాలు ఏదో ఒక విధంగా నడుస్తూనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికలు రాగానే కుల, మతతత్వ రోగాలు అంటుకొని విభజన జరుగుతుందని పేర్కొన్నారు. ఎవరికి, ఎందుకు ఓటేస్తున్నాం.. ప్రయోజనాలేంటని ఆలోచించకుండా ఓటు వేయవద్దని సూచించారు. బీఆర్ఎస్ కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితమైన పార్టీ కాదని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
"భారత్‌లో 70 వేల టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించొచ్చు. తద్వారా పంటల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉండొచ్చు. మహారాష్ట్రలో రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు..? ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితులు ఉండేవి. కర్షకులు సాగు, తాగు, కరెంట్ కష్టాలతో అల్లాడేవారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియక.. రేయింబవళ్లు ఇబ్బందులు పడేవారు. రాత్రిపూట మోటార్ పెట్టేందుకు వెళ్లి పాము, తేలు కాట్లు, కరెంట్ షాక్‌కు గురై చనిపోయేవారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఆ కష్టాలన్నీ పోయాయి. అన్నదాతల ఆత్మహత్యలు ఆగిపోయాయి. వలసపోయిన వారంతా సొంతూర్లకు వచ్చి సాగు చేసుకుంటున్నారు. 24 గంటల కరెంట్ ఇస్తుండటం వల్ల పంటలకు ఢోకా లేదు. రైతుబంధు రూపంలో ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నాం. బీఆర్ఎస్ సర్కార్ వస్తే మహారాష్ట్రలోనూ రైతును రాజును చేసే విధానం తీసుకొస్తాం." -కేసీఆర్ , బీఆర్ఎస్ అధినేత
ఇవీ చదవండి:BRS Foundation Day: 23వ వసంతంలోకి BRS.. తెలంగాణభవన్‌లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు
దిగ్గజాల నేల.. పాత మైసూరులో ఎవరిది పైచేయి.. ఒక్కలిగ ఓట్లెవరికి?