KCR Interesting Comments in Aurangabad: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జబిందా మైదానానంలో భారత్ రాష్ట్ర సమితి బహిరంగ సభ నిర్వహించింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఛత్రపతి శివాజీ, బసవేశ్వరుని, అంబేడ్కర్, పూలే చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఇందులో భాగంగానే పలువురు మరాఠా నేతలు ముఖ్యమంత్రి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. సీఎం వెంట ఎంపీలు కేశవరావు, సంతోష్, రంజిత్‌రెడ్డి, మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ ఉన్నారు.
మహారాష్ట్ర పవిత్రభూమికి నమస్కారం అంటూ కేసీఆర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. మరాఠా భూమి ఎందరో మహానుభావులకు జన్మనిచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్‌కు ఒక లక్ష్యం ఉందని అన్నారు. తాను చెప్పిన మాటలు విని వదిలేయద్దని వాటిపై చర్చించాలని చెప్పారు. మీ వీధిలో, మీ ఊరిలో.. మీ ఇంటివాళ్లు, స్నేహితులు వీధిలో ఉన్నవారందరితో చర్చలు జరపాలని వివరించారు. దేశంలో ఏం జరుగుతుందో గమనించాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు
నీటి సమస్యలెందుకు?: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిందని కేసీఆర్ తెలిపారు. ఇప్పటికీ ప్రజలకు సాగు, తాగునీరు సరిగా అందట్లేదని పేర్కొన్నారు. సాగు, తాగునీరు అందించని పాపం ఎవరిదని ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా వంటి నదులున్నా.. మహారాష్ట్రకు నీటి సమస్యెందుకు? అని అన్నారు. మహారాష్ట్ర ద్వారా అన్ని నదులు ప్రవహిస్తున్నా నీటి కరువెందుకు? అని వివరించారు. దేశంలో అనేక నదులు ఉన్నా నీటి సమస్యలెందుకు? అని వెల్లడించారు.
పాపానికి బాధ్యులెవరు?: ముంబయి దేశ ఆర్థిక రాజధాని.. కానీ తాగేందుకు నీళ్లుండవా అని కేసీఆర్ ప్రశ్నించారు. తాగడానికి నీళ్లు దొరకని పాపానికి బాధ్యులెవరు? అని అన్నారు. దేశం పురోగమిస్తుందా.. తిరోగమిస్తుందా ఆలోచించాలని అక్కడివారిని కోరారు. ఔరంగాబాద్, అకోలాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. దేశంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదని విమర్శించారు. పేదలు మరింత నిరుపేదలుగా మారుతున్నారని.. సంపన్నులు.. మరింత సంపన్నులుగా అవుతున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఇదంతా మన కళ్లముందే జరుగుతోంది: ఇదంతా మన కళ్లముందే జరుగుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. ఇది ఇలాగే జరగాలా.. చికిత్స చేయాలా... చెప్పండని ప్రశ్నించారు. ఎంత త్వరగా మేలుకుంటే.. అంత త్వరగా బాగుపడతామని అన్నారు. సమస్యలకు పరిష్కారం లభించకుంటే ఏం చేయాలి? అని వివరించారు. ఇంకెంత కాలం పరిష్కారం కోసం ఎదురుచూడాలి? అని తెలిపారు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పిస్తున్నా ఊరుకోవాలా? అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.