KCR Interesting Comments in Nanded: మహారాష్ట్ర వ్యాప్తంగా వారం, పది రోజుల్లో ఇంటింటికి బీఆర్ఎస్ ప్రచారం నిర్వహిస్తామని బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇందుకోసం మహారాష్ట్రీయులు పిడికిలి బిగించాలని సూచించారు. 8 ఏళ్ల క్రితం తెలంగాణలోనూ ఎన్నో సమస్యలు ఉండేవని గుర్తు చేశారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్ కొరత ఉండేదని తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో ఆయన వెల్లడించారు.
తెలంగాణలో క్రమంగా అన్ని సమస్యలను అధిగమించామని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని వివరించారు. రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతుబంధు ఇస్తున్నామని అన్నారు. రైతు ఏ కారణంతో చనిపోయినా రూ. 5లక్షల బీమా ఇస్తున్నామని వివరించారు. తెలంగాణలో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీళ్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇవన్నీ తెలంగాణలో సాధ్యమైనప్పుడు.. మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు.
ఇలాంటి పథకాలు కావాలంటే రైతు సర్కార్ రావాలి: ఇలాంటి పథకాలు కావాలంటే రైతు సర్కార్ రావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. వచ్చే పరిషత్ ఎన్నికల్లో మరాఠా ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించాలని ఆయన కోరారు. దేశంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. కేవలం బొగ్గుతోనే దేశమంతటా 24 గంటల విద్యుత్ ఇవ్వొచ్చని తెలిపారు. తెలంగాణలో వచ్చిన మార్పు.. దేశమంతా రావాల్సిన అవసరముందని వివరించారు. రైతు సర్కార్ వస్తేనే దేశం మారుతుందని స్పష్టం చేశారు.
దేశమంతా గులాబీ జెండా ఎగరాలి.. కిసాన్ సర్కార్ రావాలి: బీఆర్ఎస్కు అధికారం ఇస్తే.. రెండేళ్లలో మహారాష్ట్రలో 24 గంటల విద్యుత్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. పంటలు కొనమని నెలలపాటు రైతులు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశమంతా గులాబీ జెండా ఎగరాలి.. కిసాన్ సర్కార్ రావాలని పేర్కొన్నారు. తెలంగాణలోని దళితబంధు దేశమంతా అమలు కావాలని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా రైతుబంధు, దళితబంధు అమలు చేస్తామని వెల్లడించారు.