సిరా చుక్కతో సీఎం కేసీఆర్ ఫ్యామిలీ ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటు వేశారంటే? KCR Family Casted Vote in Telangana Elections 2023 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఓటర్లూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాధారణ పౌరులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వాధికారులూ తమ తమ పోలింగ్ బూత్‌లలో ఓటు వేసి 'మా వంతు అయిపోయింది.. ఇక మీ వంతే మిగిలింది' అంటూ సందేశమిస్తూ ప్రోత్సహిస్తున్నారు.
Telangana Assembly Elections Polling 2023 : ఇక.. మూడోసారి అధికారమే లక్ష్యంగా మొన్నటి వరకు ప్రచారాలతో బిజీబిజీగా గడిపిన కల్వకుంట్ల కుటుంబసభ్యులు.. నేడు ఎవరికి వారు తమ తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోశ్ కుమార్ కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి.. తమ తమ బూత్‌లలో ఓటు వేశారు. ఓటు వజ్రాయుధం లాంటిదని.. నచ్చిన అభ్యర్థిని, తమకు ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఉన్న అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అదృష్ట పరీక్షలో ఏడుగురు ఎంపీలు - 104 మంది ఎమ్మెల్యేలు
చింతమడకలో ఓటేసిన కేసీఆర్..: సిద్దిపేట జిల్లా చింతమడకలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీమణి శోభతో కలిసి చింతమడకకు చేరుకున్న ఆయన.. స్థానిక పోలింగ్ కేంద్రంలో సతీసమేతంగా ఓటు వేశారు. అనంతరం సిరా చుక్కతో బయటకొచ్చిన కేసీఆర్.. అక్కడి వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. సీఎం రాక దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భారీగా పోలీస్ సిబ్బందిని మోహరించారు.
బంజారాహిల్స్‌లో కేటీఆర్, సిద్దిపేటలో హరీశ్‌రావు..: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్యతో కలిసి ఓటు వేసిన ఆయన.. నచ్చిన ప్రభుత్వాన్ని, అభ్యర్థిని ఎన్నుకునేందుకు ప్రజలంతా ఓటు వేయాలని సూచించారు. పట్టణ ప్రజలు సెలవు దినంగా భావించకుండా.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని కోరారు. పట్టణ ప్రాంత ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ముందుకు రావాలని హరీశ్‌రావు సూచించారు. సిద్దిపేట భరత్ నగర్‌లోని అంబిటస్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే బాగుంటుందో ఆలోచించి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కుటుంబసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న హరీశ్‌రావు
ఓటేసిన రాజకీయ ప్రముఖులు - విద్యావంతులంతా తమ బాధ్యత నిర్వర్తించాలని పిలుపు
లైన్ ఉన్నా భరిద్దాం.. అడుగు బయటపెట్టి ఓటేద్దాం..: బంజారాహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా దేశ రక్షణ కోసం బార్డర్లో సైనికులు బయటి నుంచి వచ్చే శత్రువులతో యుద్ధం చేస్తారని.. కానీ మనతో ఉండే శత్రువులపై యుద్ధం చేయటానికి మనమే బయల్దేరాలని కవిత పేర్కొన్నారు. మనతో పాటు మన పిల్లల భవిష్యత్ కోసం కాసేపు లైన్ ఉన్నా భరిద్దామన్న ఆమె.. అందరం అడుగు బయటపెట్టి ఓటేద్దాం రండి అంటూ పిలుపునిచ్చారు. ఇక.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోశ్‌కుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాకలో కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు.
విధులతో పాటు బాధ్యతనూ నిర్వర్తిస్తాం - ఓటెత్తిన ప్రభుత్వాధికారులు
మీ ఓటు తెలంగాణ బతుకు చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దాలి - రాష్ట్ర ప్రజలకు ప్రముఖుల సందేశం