KCR Comments on Central Government: సాధారణ వ్యాపారి అదానీ.. రెండేళ్లల్లోనే ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి ఎలా ఎదిగారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. ప్రధాని మిత్రుడైన అదానీ అంత వేగంగా ఎలా ఎదిగారని పేర్కొన్నారు. అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ రూ.87,000 కోట్లు ఎందుకు పెట్టుబడి పెట్టాల్సి వచ్చిందని నిలదీశారు. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్లో సమాధానం చెప్పి తీరాలి: అదానీ వ్యవహారంపై పార్లమెంట్లో సమాధానం చెప్పి తీరాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. మనదేశంలో విధానపరంగా ఎన్నో లోపాలు ఉన్నాయని వెల్లడించారు. 6 లక్షల జనాభా ఉన్న సిక్కిం ఒక రాష్ట్రమే.. 25 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ ఒక రాష్ట్రమని అన్నారు. గోదావరి నది నుంచి ఏటా 2,000 నుంచి 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎన్నోసార్లు చర్చించి గోదావరిపై ప్రాజెక్టులు చేపట్టామని గుర్తు చేశారు.
దేశంలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వొచ్చు: చిన్నచిన్న దేశాలు కూడా అద్భుత ప్రగతి సాధిస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. అణుబాంబు దాడితో నష్టపోయిన జపాన్ అద్భుత ప్రగతి సాధించిందని గుర్తు చేశారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడమే బీఆర్ఎస్ లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలో ప్రజలకు సరిపడా సహజ వనరులు ఉన్నాయని తెలిపారు. దేశంలో ఏటా 1.40 లక్షల టీఎంసీల మేర వర్షం కురుస్తోందని.. సాగు కోసం 40 వేల టీఎంసీలు సరిపోతాయని వివరించారు. ప్రభుత్వం తలచుకుంటే దేశంలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వొచ్చని ఆయన స్పష్టం చేశారు.
దేశప్రగతి కోసం అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచనలు కావాలి: 2004లో వేసిన బ్రిజేష్ ట్రైబ్యునల్ ఇప్పటివరకు నీటి వాటాలు తేల్చలేదని కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికీ రాష్ట్రాల మధ్య జల యుద్ధాలు ఎందుకని ప్రశ్నించారు. సరిపడా జలాలు ఉన్నా.. రాష్ట్రాలు ఎందుకు కొట్టుకుంటున్నాయని తెలిపారు భారీ రిజర్వాయర్ల నిర్మాణం గురించి కేంద్రం ఎందుకు ఆలోచించటం లేదని నిలదీశారు. దేశప్రగతి కోసం అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచనలు కావాలని కేసీఆర్ అన్నారు.
75 ఏళ్లు గడిచినా ఎన్నో విషయాల్లో భారత్ వెనకబడి ఉంది: దేశ జలవిధానం పూర్తిగా మారాలని కేసీఆర్ వివరించారు. మన దేశానికి 4.10 లక్షల మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఉందని వెల్లడించారు. అనేక రాష్ట్రాలు విద్యుత్ కొరతతో ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. దేశ రాజధాని దిల్లీలో కూడా నీరు, విద్యుత్ కొరత ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఎన్నో విషయాల్లో భారత్ వెనకబడి ఉందని అన్నారు. సమస్యల పరిష్కారం వదిలేసి మాటలతో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు.