కేబినెట్ కూర్పులో సామాజిక వర్గాల సమప్రాధాన్యం...!
రాష్ట్రంలో ఏర్పాటుకానున్న మంత్రివర్గ విస్తరణలో ప్రధాన సామాజిక వర్గాలు, జిల్లాల ప్రాతినిధ్యానికి సమ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అన్ని సామాజికవర్గాలను కేబినెట్లో అవకాశం ఇచ్చే దిశగా జాబితా రూపొందిస్తున్నారు. జిల్లాలకు మంత్రిపదవి ఇవ్వని నేపధ్యంలో పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శులు, శాసనసభ ఉపసభాపతి, చీఫ్ విప్, విప్ పదవులను పరిగణలో తీసుకుంటారని తెరాస శ్రేణులు భావిస్తున్నాయి.
రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో జరగనున్న మంత్రి వర్గ విస్తరణలో ప్రధాన సామాజిక వర్గాలు, జిల్లాల ప్రాతినిధ్యంలో సమతూకం పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నారు. కేబినెట్లో గరిష్ఠంగా 18 మందికి అవకాశం ఉండగా... తొలి విస్తరణలో 8 మందిని తీసుకోనున్నారు. దీనికి అనుగుణంగా ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఓసీ, మహిళా, మైనారిటీలకు చోటు లభించేలా సీఎం జాబితా రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓసీ కోటాలో, మహమూద్ అలీ మైనారిటీ కోటాలో ఉన్నారు. అలాగే మహిళా కోటాలోనూ మంత్రుల నియామకం దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. మహిళా మంత్రిగా రేఖానాయక్ లేదా పద్మా దేవేందర్ రెడ్డిలకు అవకాశం దక్కనుంది. రేఖా నాయక్ మంత్రి అయితే మహిళా, ఎస్టీ కోటా కింద, దేవేందర్ రెడ్డికి అవకాశమిస్తే ఓసీ, మహిళా కోటాల్లో పరిగణించే అవకాశాలున్నాయి. మరోవైపు తెరాస తరపున ఎన్నికల్లో 20 మంది బీసీలు గెలిచారు. వీరికి మరో స్థానం అదనంగా కేటాయించే అవకాశమూ లేకపోలేదు.
బీసీ కోటాలో బలమైన సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఈటెల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ / నోముల నర్సింహయ్య, దాస్యం వినయ్ భాస్కర్ / బాజిరెడ్డి గోవర్ధన్ / జోగురామన్నలకు అమాత్య యోగం కలగనుంది. ఓసీ కోటాలోనూ పోటీ బాగానే ఉంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి / గుత్తా సుఖేందర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి / లక్ష్మారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌లు అమాత్య జాబితాలో ఉన్నారు.
మొదటి విడత విస్తరణలో తీసుకునే ఎనిమిది మందిలో... ఎస్సీ, ఎస్టీ, మహిళా కోటా నుంచి ఒక్కొక్కరు, బీసీల నుంచి ఇద్దరు, మిగిలిన సామాజిక వర్గాల నుంచి ముగ్గురు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం 31 జిల్లాలు ఉండగా, త్వరలో మరో రెండు ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శులు, శాసనసభ ఉపసభాపతి, చీఫ్ విప్, విప్ పదవులకు మిగిలిన వారిని పరిగణలోకి తీసుకుంటారని తెరాస శ్రేణుల భావన.