తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్టీసీ విలీనం ఒక సవాల్​.. అయినా చేసి చూపించాం..' - ఆర్టీసీ తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటాన్ని చాలా మంది వ్యతిరేకించారని రవాణా శాఖ మంత్రి పేర్నినాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఈ అంశంపై జగన్​ను హెచ్చరించారని, కార్మికుల వేతనాలు భరించడం కష్టమేనన్నారు. అయినా ఏపీ సీఎం జగన్ సవాలుగా తీసుకొని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. అయినా కొందరు కార్మికులు ప్రభుత్వాన్ని అనుమానిస్తున్నారని ఈ వైఖరి సరికాదని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల వైఖరి వల్లే ఆర్టీసీ నష్టపోతోందని.. నష్టాలకు కార్మికులు కారణం కాదన్నారు.

kcr-advises-jagan-not-to-merge-rtc-into-government
'ఆర్టీసీ విలీనం ఒక సవాల్​.. అయినా చేసి చూపించాం..'

By

Published : Feb 15, 2020, 7:35 AM IST

'ఆర్టీసీ విలీనం ఒక సవాల్​.. అయినా చేసి చూపించాం..'

ఇంధన పొదుపు చేయడం, సహా ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానానికి చేర్చిన ఆర్టీసీ కార్మికులకు ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్నినాని అవార్డులు అందించారు. ప్రమాదం లేకుండా సమర్థంగా విధులు నిర్వహిస్తోన్న డ్రైవర్లను విజయవాడలో ఘనంగా సన్మానించారు. సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో రవాణా శాఖ ఉన్నతాధికారులు సహా పలు జిల్లాల నుంచి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మంత్రి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని సర్కారులో విలీనం చేయవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్​ సూచించినా ముఖ్యమంత్రి ఒక సవాల్​గా తీసుకొని దానిని పూర్తి చేశారన్నారు. రాష్ట్రంలో కార్మికులందరికీ 1వ తేదీనే వేతనాలందేలా ఆదేశించారని మంత్రి స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల కంటే ముందే పెన్షన్​ సాధ్యమా..?

ఆర్టీసీ బతకాలి, పదవీ విరమణ అనంతరం పింఛన్‌ తీసుకోవాలనే రెండు కోరికలతోనే కార్మికులు విలీనాన్ని కోరుకున్నారని పేర్ని నాని అన్నారు. ప్రభుత్వాన్ని కొందరు కార్మికులు నిందించడం ముఖ్యమంత్రికి బాధ కలిగిస్తోందన్నారు. ఆర్టీసీ కార్మికులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు సైతం పెన్షన్ విధానాన్ని అమలు చేయాల్సి ఉందని మంత్రి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కంటే ముందే ఆర్టీసీలో కార్మికులకు పెన్షన్ ఇవ్వడం సాధ్యమా.. ప్రభుత్వం నిలబడగలుగుతుందా అనేది కార్మికులు ఆలోచించాలన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ ఆలోచన విధానం తప్పు ఉందని భావిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పేర్ని నాని సవాల్ విసిరారు.

నష్టాలకు కార్మికులు కారణం కాదు

ఆర్టీసీకి నష్టాలు రావడానికి వివిధ ప్రభుత్వాలు, వాటి విధానాలే కారణం తప్ప కార్మికులు కారని పేర్ని నాని అన్నారు. భవిష్యత్తులో ఏదైనా సమస్యపై కింది కోర్టులో కార్మికులు గెలిస్తే... సంస్థ తరఫున పైకోర్టుకు వెళ్లకుండా... కింది కోర్టు ఆదేశాలు అమలు చేసేలా తాను చర్యలు తీసుకుంటానన్నారు. శారీరక సమస్యలతో ఉద్యోగం పోగొట్టుకుని కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్న వారిని తిరిగి విధుల్లోకి చేర్చుకునే అంశాన్ని పునఃపరిశీలించేందుకు త్వరలోనే ఓ కమిటీ వేస్తామన్నారు.

నెలకు ఓ రోజు గ్రీవెన్స్​ డే

కారుణ్య నియామకాలకు సంబంధించి ఆర్టీసీలో ఉద్యోగ అర్హత లేని వారికి అదే జిల్లాలో ఏదైనా ప్రభుత్వ విభాగంలో ఉద్యోగాలిస్తామని మంత్రి తెలిపారు. కార్మికుల సమస్యల తక్షణ పరిష్కారం కోసం నెలకు ఒక రోజు గ్రీవెన్స్ డేగా త్వరలో నిర్వహిస్తామని ప్రకటించారు.

ఇదీ చదవండి:సహకార పోలింగ్ షురూ... మధ్యాహ్నం నుంచి కౌంటింగ్...

ABOUT THE AUTHOR

...view details