శ్రీశైలంలో అగ్నిప్రమాద ఘటన దురదృష్టకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సిబ్బంది చాలా ప్రయత్నించారని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యుత్ రంగంపై అసెంబ్లీలో ఆయన చర్చించారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కేంద్ర విద్యుత్ చట్టంలో అనేక లోపాలున్నాయన్నారు.
''కేంద్ర విద్యుత్ చట్టం ద్వారా రాష్ట్రాల అధికారాలు దిల్లీ వెళ్తాయి. కేంద్ర విద్యుత్ చట్టాన్ని మేం పార్లమెంటులో వ్యతిరేకిస్తాం. విద్యుత్ రంగం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంటేనే డిస్కంలు, ట్రాన్స్‌కో, జెన్‌కో అభివృద్ధి చెందుతాయి. ఈ సంస్థలు లేకుంటే వేల ఉద్యోగాలు పోతాయి. కేంద్ర విద్యుత్ చట్టం వస్తే ఇష్టారాజ్యంగా ప్రైవేటు కంపెనీలు వస్తాయి. ప్రభుత్వం వద్ద ఉన్న అధికారాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తారు. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చే ప్రణాళిక కేంద్రానికి లేదు. దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుదుత్పత్తి ఉంది. ''