ఆ తల్లిదండ్రులు రాజకీయాల గురించి మాట్లాడుకునేటప్పుడు సుష్మాస్వరాజ్ ప్రస్తావన ఎక్కువగా వచ్చేది. అంతే ఇద్దరూ కలిసి తమ కూతురు రాజకీయాల్లో రాణించాలని అనుకున్నారు. అనుకోకుండా బల్దియా ఎన్నికలు రావడం వారికి కలిసొచ్చింది. పార్టీకి దరఖాస్తు చేసుకోవడం, టికెట్ లభించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. డిగ్రీ (బీకాం కంప్యూటర్స్) అయిపోగానే ప్రజాప్రతినిధిగా ఎన్నికవడం కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ రచనశ్రీ గొడ్చాల జీవితంలో ఊహించని మార్పు ఇది.
కవాడిగూడ డివిజన్ పెద్దకూతురు.. కార్పొరేటర్ రచన - corporator rachana
భాజపా అంటే ఆ తండ్రికి ఎనలేని అభిమానం.. పైగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త.. చిన్న వ్యాపారం చేసుకుంటూ రాజకీయాల్లో ఉన్నా ఏనాడూ ప్రజాప్రతినిధిగా ఎన్నికవ్వాలన్న ఆశ ఆయనలో ఉండేది కాదు. ఇక తల్లి మనసులో మాత్రం ఒక కోరిక ఉండేది. ముగ్గురు సంతానం ఉన్నా తన పెద్దకూతుర్ని దివంగత కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌లా చూడాలనుకుంది.
150 మందిలో 21 ఏళ్లకే కార్పొరేటర్ అయిన ఈమె విజయం వెనుక ఆమె స్నేహితులే ఎక్కువగా ఉన్నారు. వారంతా రచనతోపాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇల్లిల్లూ తిరగడం, స్థానిక సమస్యలకు తాము చేయబోయే పరిష్కారాలు వివరించడం, ఇతర సమస్యలుంటే రాసుకోవడం, అందరినీ ఆప్యాయంగా పలకరించడం, సామాజిక మాధ్యమాలను వినియోగించడం ద్వారా ఓటర్లను ఆకట్టుకున్నారు. అదీగాక అతిచిన్న వయసు కావడం, రాజకీయాలకు కొత్త అనే అంశాలు ఓటర్లను ఆలోచింపజేశాయి. ఇవన్నీ కలిసి రావడంతో ప్రత్యర్థి సిట్టింగ్ కార్పొరేటర్ అయినా రచన గెలుపు సునాయాసమైంది.
మరోవైపు ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద తండ్రి వెంకటేశ్‌కు ఉన్న టెంట్‌హౌస్ తనకు రాజకీయాల మీద ఆసక్తి కలిగేలా చేసింది. అదెలాగంటే అక్కడికి వచ్చిన పలు పార్టీల నేతలు మాట్లాడుకునే అంశాలు రచనను ప్రజాప్రతినిధిగా గెలిచేలా చేశాయి. డివిజన్ పక్కనే ఉన్న హుస్సేన్‌సాగర్ నాలా కారణంగా వరదలొచ్చిన ప్రతిసారీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తుంటామని, దానికి రక్షణ గోడ నిర్మించడం తన ప్రధాన కర్తవ్యమని తెలిపింది. నామమాత్రపు ఖర్చుతో 1500 ఓట్ల మెజార్టీ సాధించానంది. అన్నట్లు రచన.. వాళ్లింట్లో పెద్దకూతురు. ఇప్పుడు కవాడిగూడ డివిజన్‌కు కూడా పెద్దకూతురే!
- ఇదీ చూడండి :అతని ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమా?