తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్తిక పౌర్ణమి.. ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రం - Kartik Purnima story

Kartik Purnima 2022: కార్తికమాసం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రమైనది. మహిమాన్వితమైనది. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రం. స్నాన, దీప, దానాలకు కార్తికం ప్రసిద్ధి. సుందరమైన ఆహ్లాదకరమైన శరదృతువులో చంద్రుడు పుష్టిమంతుడై తన శీతల కిరణాల ద్వారా సమస్త జీవులకు శక్తిని ప్రసాదిస్తాడు.

Kartik Purnima 2022
Kartik Purnima 2022

By

Published : Nov 7, 2022, 10:00 AM IST

Kartik Purnima 2022: కార్తికమాసం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రమైనది. మహిమాన్వితమైనది. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రం. స్నాన, దీప, దానాలకు కార్తికం ప్రసిద్ధి. సుందరమైన ఆహ్లాదకరమైన శరదృతువులో చంద్రుడు పుష్టిమంతుడై తన శీతల కిరణాల ద్వారా సమస్త జీవులకు ధీశక్తిని ప్రసాదిస్తాడు. కార్తికంలో చెరువులు, బావుల్లో నీరు తేటపడి సూర్యరశ్మి ప్రసారం వల్ల గొప్ప తేజస్సును, బలాన్ని సంతరించుకుంటుంది. దైవపూజకు అవసరమైన పుష్ప సమృద్ధిని ప్రకృతి ప్రసాదిస్తుంది.

కార్తికంలో పవిత్ర జలాన్ని ‘హంసోదకం’ అంటారు. శరదృతువులో నదీ జలాలు ఔషధ గుణాలు కలిగి సారవంతంగా ఉంటాయని ఒక భావన. ఈ నీరు స్నానపానాలకు అమృతతుల్యమని ఆయుర్వేద మహర్షుల భావన. కార్తిక దీపం ఉత్తమ ఫలాలను ఇస్తుంది. ఉభయ సంధ్యల్లో శివకేశవ మందిరాల్లో, తులసి సన్నిధిలో దీపాన్ని వెలిగించడం మహోత్కృష్టమైన సత్కర్మ. కార్తిక పౌర్ణమి నాటి దీప దానాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు.

శివాలయాల్లో జ్వాలాతోరణం: ఈ రోజున శివాలయాల్లో జ్వాలాతోరణం చేస్తారు. పార్వతీదేవి సాగర మథన సమ యంలో హాలాహలం మింగమని శివుణ్ని ప్రార్థించిన సందర్భానికి సంకేతంగా ఈ ఉత్సవం చేస్తారు. చంద్రుడు మనసుకు ప్రశాంతతను ఇస్తాడు. తమోగుణాన్ని హరిస్తాడు. అందుకే అతడిని శివుడు తన జటాజూటంలో ధరించాడు. అందుకే అతడి పేరున ఏర్పడిన సోమ(చంద్ర)వారం ఈ నెలలో విశిష్టమైనది. పూర్ణిమ నాటి వెన్నెల ఆరోగ్యకరం.

త్రిపురాసురులను సంహరించినట్లు కథనం: కార్తిక పూర్ణిమ నాడు వెన్నెల్లో పరమాన్నం వండుకొని పూజాదికాలు నిర్వర్తించి, ప్రసాదాలు స్వీకరించే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది. కార్తిక పూర్ణిమను త్రిపుర పూర్ణిమ అనీ వ్యవహరిస్తారు. త్రిపురాసురులను పరమశివుడు ఈ దినం సంహరించినట్లు కథనం. శివుడి ప్రీత్యర్థం భక్తేశ్వర వ్రతం చేస్తారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివుణ్ని అభిషేకించి, మారేడు దళాలతో పూజిస్తారు.

కార్తిక పౌర్ణమి నాడే గురునానక్‌ జననం: కార్తిక పౌర్ణమి నాడే సిక్ఖుల గురు పరంపరలో మొదటివారైన గురునానక్‌ 1469లో జన్మించారు. బాల్యం నుంచీ దైవచింతన కలిగిన నానక్‌ భారతీయ పురాణాలను, మహమ్మదీయుల ఖురాన్‌ను అధ్యయనం చేశారు. తన సమకాలీన సామాజిక, ధార్మిక పరిస్థితులు ఆయనకు ఆందోళన కలిగించాయి. పరస్పర విరోధ భావనతో జీవిస్తున్న మతాల ప్రజల మధ్య సామరస్యాన్ని సాధించడానికి ‘సిక్ఖు’ మతాన్ని స్థాపించారు. పంజాబీ భాషలో ‘సిక్ఖు’ అంటే శిష్యుడని అర్థం.

నైతిక విలువలకు ప్రాధాన్యం:సామాజిక వర్గాల మధ్య అసమానతలను తొలగించడం, స్త్రీల పట్ల గౌరవ భావాన్ని పెంపొందించడం నానక్‌ ఆశయాలు. ఆయన వర్ణ విభేదాలను, విగ్రహారాధనను వ్యతిరేకించారు. ఏకేశ్వరోపాసన, ప్రేమతత్వం, భక్తి మార్గం ఆయన ప్రధాన సిద్ధాంతాలు. నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చిన నానక్‌ డాంబిక జీవనాన్ని నిరసించారు. జీవితాన్ని ఎగిరే పక్షిగాను, జీవితాన్ని నడిపే ఆత్మను బొమ్మ బండికి బిగించిన చక్రంగాను నానక్‌ అభివర్ణించారు. ఆయన అనేక భక్తి గీతాలు రచించారు. నానక్‌ రూపకల్పన చేసిన ‘గురుగ్రంథ సాహిబ్‌’ సిక్ఖుల పవిత్ర గ్రంథం. గురు నానక్‌ 1539లో పరమపదించారు. - డి.భారతీదేవి

ఇవీ చదవండి:మీ దోస్త్​తో గొడవైందా.. ఈ టిప్స్​ ట్రై చేయండి కూల్ అయిపోతారు..!

తండ్రి లేని వారికి మోదీ అండ ఒక్కటైన 551 జంటలకు ఆశీర్వచనం

ABOUT THE AUTHOR

...view details