తెలంగాణ

telangana

By

Published : Nov 12, 2019, 8:18 AM IST

Updated : Nov 12, 2019, 8:23 AM IST

ETV Bharat / state

కార్తీక పూర్ణిమం... శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రం

శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీకం. ఈ నెలలో చంద్రుని వెన్నెలకాంతులు పౌర్ణమి రోజున నిండుగా భూమిపైకి ప్రసరిస్తాయి. స్వచ్ఛమైన పాలనురుగు లాంటి వెన్నెలను మనం పౌర్ణమి రోజున వీక్షించగలం.

కార్తీక పూర్ణిమం... శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రం

కార్తీక పూర్ణిమ పర్వదినం ఏనాటి నుంచో భారతావనిలో జరుగుతూ వస్తోంది. పద్మపురాణంలో ఈ పండుగను శౌనకాది మునులు జరుపుకొన్న విధానాన్నే కార్తీక పురాణ పారాయణలో పదిహేనో రోజు పారాయణాంశంగా చెబుతారు. నైమిశారణ్యంలో సూత మహర్షి ఆధ్వర్యంలో మునులంతా శ్రీహరి ప్రతిమను ఒక ఉసిరి చెట్టు కింద ఏర్పాటు చేశారు.

వనభోజన సమారాధన జరిగింది. తులసి పూజ నిర్వహించి సాయంత్రానికి మళ్లీ కార్తీక దామోదరుడిగా శ్రీమహావిష్ణువును భావించుకొని ఆయనకు నమస్కరించి దీపారాధన చేసి షోడశోపచారాలతో అర్చించారు. ఆ తర్వాత ఓ చక్కటి మానుతో చేసిన స్తంభాన్ని తెచ్చి దాని మీద బియ్యం, నువ్వులు లాంటి ధాన్యాలను, దాని మీద ఆవు నేతిలో దీపాన్ని వెలిగించి శ్రీమహావిష్ణువును అర్చించారు.

కార్తీక పురాణాన్ని మొదటి రోజు నుంచి పదిహేనో రోజు వరకు ఉన్న అంశాలను, కథలను అన్నిటినీ పారాయణ చేశారు. ఆనాటి రాత్రి హరినామ స్మరణంతోనూ, సంకీర్తనలు, నృత్యాలతోనూ భక్తి పారవశ్యంతో కాలం గడిపారు. ఈ కథా భాగాన్ని కార్తీక పురాణ పారాయణలో పదిహేనో రోజు చేస్తుంటారు.కార్తీక పౌర్ణమినాడు ఈశ్వరుడి గురించి చేసే ఓ వ్రతం ప్రచారంలో ఉంది. దీనినే భక్తేశ్వర వ్రతం అంటారు. ఈ వ్రతాచరణ వెనుక ఉన్న ఓ కథను పురాణాలు ఇలా పేర్కొంటున్నాయి.

పూర్వం మథురను చంద్రపాండ్యుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతడికి కుముద్వతి అనే అనుకూలవతి అయిన భార్య ఉండేది. ఆ రాజుకు చాలా కాలం వరకూ సంతానం కలగలేదు. సంతానం కోసమని శివుడి గురించి ఆ దంపతులిద్దరూ చాలా కాలం పాటు తపస్సు చేశారు. తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై వారి కోరిక విని అల్పాయుష్కుడైన కొడుకు కావాలా? ఆయుష్షుండీ విధవరాలుగా ఉండబోయే కూతురు కావాలా? అని అడిగాడు. వారు కొడుకే కావాలని కోరారు. వారిని అనుగ్రహించి ఈశ్వరుడు అంతర్థానమయ్యాడు.

కార్తీకం.. భక్తిపారవశ్యం

రాణి కొంతకాలానికి గర్భవతియై చక్కటి కుమారుడిని ప్రసవించింది. ఆ పిల్లవాడు బాగా పెరిగి పెద్దవాడయ్యాడు. అదే రోజుల్లో అలకాపురినేలుతున్న మహారాజు మిత్రసహుడికి ఒక కుమార్తె ఉండేది. ఆమె చిన్న వయస్సు నుంచి ఈశ్వరుడిని గొప్పగా ఆరాధిస్తూ ఉండేది. భక్తేశ్వరలింగాన్ని ఆమె నిరంతరం పూజిస్తూ ఉండేది. మథుర రాజుకు మిత్రసహుడి కుమార్తె గురించి తెలిసింది. తన కుమారుడికి మరణకాలం ప్రాప్తిస్తుందని ఆ రాజు గ్రహించి ఆ ఆపద నుంచి తన కుమారుడిని కాపాడుకోవటానికి మిత్రసహుడి కుమార్తెనిచ్చి వివాహం చేయటం మేలనుకున్నాడు. అప్పుడు ఆమె తన భక్తితోనూ, పాతివ్రత్యంతోనూ తన కుమారుడిని రక్షించుకోగలనన్నది చంద్రపాడ్యుడి ఆలోచన.

అలా చంద్రపాడ్యుడు ఎలాగో ఒక లాగా మిత్రసహుడిని ఒప్పించి ఆయన కూతురుకు తన కుమారుడిని ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్త్లెన కొద్ది రోజులకే చంద్రపాండ్యుడి కుమారుడి ఆయుష్షు తీరిపోవటంతో యముడు బయలుదేరి వచ్చాడు. ఆ విషయాన్ని గమనించిన మిత్రసహుడి కుమార్తె వెంటనే తన దైవమైన భక్తేశ్వరుడిని స్మరించింది. భక్తేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై యముడితో పోరి జయించి, చంద్రపాండ్య రాజు కుమారుడి ప్రాణాలను రక్షించి, పూర్ణాయువు ప్రసాదించి అంతర్థానమయ్యాడు. ఇది భక్తేశ్వర వ్రత కథ. నిష్కల్మష భక్తితో ఏదైనా సాధించవచ్చన్న ఓ సత్యాన్ని ఈ వ్రత కథ పేర్కొంటోంది.

కార్తీక పౌర్ణమినే మహాకార్తీక అని అంటారు. ఆ రోజు పుణ్యనదులు, సముద్రాల్లో స్నానం చేస్తే మామూలుగా లభించే పుణ్యం కన్నా అధిక పుణ్యం లభిస్తుందన్నది నమ్మకం. మహాఫల, నానాఫల, సౌభాగ్య, మనోరథ పూర్ణిమ, కృత్రిక, గోప్రధాన తదితర వ్రతాలను, వ్రత ఉద్యాపనలను ఈనాడు చేస్తుంటారు. లక్ష తులసీపూజ, లక్ష దీపార్చన, జ్వాలా తోరణం లాంటి పూజలు, ఉత్సవాలు జరుగుతాయి.

Last Updated : Nov 12, 2019, 8:23 AM IST

ABOUT THE AUTHOR

...view details