తెలంగాణ

telangana

ETV Bharat / state

కర్ణాటక ప్రతిపాదన...తెలుగు రాష్ట్రాలకు అన్యాయం!

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి విషయంలో చిక్కులు తేలకపోగా.. కొత్తగా కర్ణాటక రాష్ట్రం తీసుకున్న నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లోని తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులపై ప్రభావం పడనుంది. తుంగభద్ర ప్రాజెక్టులోకి వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గించనున్నట్లు కర్ణాటక పేర్కొంది. ఆ నిర్ణయంతో రెండు తెలుగు రాష్ట్రాలకు నష్టం ఉంటుందని నీటిపారుదల వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

karnataka-tungabhadra-decision-injustice-to-telugu-states
కర్ణాటక ప్రతిపాదన...తెలుగు రాష్ట్రాలకు అన్యాయం!

By

Published : Mar 9, 2021, 4:03 AM IST

Updated : Mar 9, 2021, 4:12 AM IST

తుంగభద్ర ప్రాజెక్టులోకి వచ్చే ప్రవాహాన్ని తగ్గించే మరో చర్యకు కర్ణాటక శ్రీకారం చుట్టింది. అప్పర్‌భద్ర ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచుతూ ఆమోదం కోసం కేంద్ర జలసంఘానికి ప్రతిపాదించింది. దీనివల్ల తుంగభద్రతోపాటు శ్రీశైలం ప్రాజెక్టుపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు నష్టం కలిగిస్తుందని నీటిపారుదల వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కర్ణాటక ప్రతిపాదన

తుంగ నది నుంచి అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోయడంతోపాటు, అప్పర్‌భద్ర నుంచి 30 టీఎంసీల వినియోగానికి కర్ణాటక ప్రతిపాదించింది. 5.6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించడంతోపాటు 367 చెరువులను నింపడానికి రూ.16,125 కోట్ల అంచనాతో ఈ పథకాన్ని చేపట్టింది. ఆమోదం కోసం కేంద్ర జలసంఘానికి పంపగా, గత డిసెంబరు 24న జరిగిన సాంకేతిక సలహా కమిటీ సమావేశమై చర్చించింది. ప్రాజెక్టు అంచనా వ్యయం, ఖర్చు-ప్రయోజనం విషయంలో కొన్ని అభ్యంతరాలు లేవనెత్తిన జలసంఘం, త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీనికి జాతీయ హోదా ఇవ్వాలని కూడా కర్ణాటక కోరుతోంది.

తెలంగాణ, ఏపీలపై ప్రభావం

గతంలోనే అప్పర్‌భద్ర ప్రాజెక్టు చేపట్టినా, దీని సామర్థ్యం పెంచడం, తుంగ నది నీటిని మళ్లించనుండటంతో తుంగభద్రకు నీటి లభ్యత తక్కువగా ఉన్న సంవత్సరాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆ ప్రాజెక్టు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తుంగభద్రకు తుంగ, భద్ర నదుల ద్వారా ప్రవాహం వస్తుంది. ఇందులో తుంగ నుంచి ఎక్కువగా వస్తుంది. తుంగభద్రపై షిమోగా సమీపంలో నాలుగు టీఎంసీల సామర్థ్యంతో ఆనకట్ట మాత్రమే ఉంది.

భద్ర నుంచి అదనంగా

బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన ఆనకట్ట స్థానంలో కొత్తది నిర్మించారు. ఇక్కడ పెద్ద ప్రాజెక్టులు నిర్మిస్తే పశ్చిమ కనుమలపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఆ ప్రయత్నం చేయలేదు. భద్రలో కర్ణాటకకు 62.5 టీఎంసీల కేటాయింపు ఉంది. ఈ మొత్తం నీరు వినియోగంలో ఉంది. అయితే భద్ర డ్యాం నుంచి అప్పర్‌భద్రకు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. గత కొన్ని సంవత్సరాలుగా దీని పనులు జరుగుతున్నాయి. గత ఏడాది రోజుకు 600 క్యూసెక్కుల చొప్పున సుమారు 20 టీఎంసీలను ఎత్తిపోసినట్లు సమాచారం. భద్ర నుంచి ఆగస్టులో తుంగభద్ర ప్రాజెక్టుకు వచ్చే ప్రవాహం కీలకం. భద్ర నుంచి అదనంగా నీటి వినియోగానికి ఏ ప్రాజెక్టు చేపట్టినా అది తమ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని చాలా కాలంగా తెలుగు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఎక్కువ నీటిని మళ్లించడానికే

ఇప్పుడు తుంగ నుంచి 17.4 టీఎంసీలను భద్ర నదికి ఎత్తిపోసి, భద్ర నుంచి 29.9 టీఎంసీలతో అప్పర్‌భద్ర ఎత్తిపోతల పథకం ప్రతిపాదన కేంద్ర జలసంఘం ముందుంది. దీని ప్రకారం చెరువులను నింపడానికే 10.86 టీఎంసీలు అవసరం. మరో 19 టీఎంసీలతో 5.6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించడం సాధ్యం కాదు. దీనిపై అభ్యంతరం వ్యక్తం కావడంతో డ్రిప్‌ ఇరిగేషన్‌ చేపట్టనున్నట్లు ప్రతిపాదించింది. అయితే తుంగ నుంచి ఎంత మళ్లించేది, అప్పర్‌భద్ర నుంచి ఎంత నీటిని వినియోగించుకొనేది పరిశీలించడానికి ఎలాంటి పర్యవేక్షణ ఉండదు. గత సంవత్సరమే 20 టీఎంసీలను ఎత్తిపోశారంటే, సవరించిన ప్రతిపాదన ప్రకారం ఎక్కువ నీటిని మళ్లించడానికి అవకాశం ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

సీడబ్ల్యూసీ అభ్యంతరాలు

అప్పర్‌భద్రలో ఇప్పటికే 30 శాతం పనులు పూర్తయినందున, ఈ సమయంలో తమ ముందుకు ఈ ప్రతిపాదన ఎందుకు తెచ్చారని కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ ప్రశ్నించగా, ప్రాజెక్టు స్వరూపం మారిందని, నీటి వినియోగం సహా అన్ని అంశాల్లో మార్పు చోటు చేసుకొందని ప్రాజెక్టు అధికారులు సమాధానమిచ్చారు. రూపాయి ఖర్చు పెడితే రూ.1.024 మాత్రమే ప్రయోజనం కలుగుతుండటంపై సీడబ్ల్యూసీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తుంగభద్ర ప్రాజెక్టుపై ఎలాంటి ప్రభావం పడుతుందన్నదానిపై ఆరా తీసినట్లు సమాచారం.

ఇదీ చూడండి :సిరా, స్కెచ్ పెన్నుల కోసం రూ.10 లక్షలు

Last Updated : Mar 9, 2021, 4:12 AM IST

ABOUT THE AUTHOR

...view details