Karnataka Results Heat On Telangana : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడుతున్న వేళ.. తెలంగాణలో రాజకీయ పరిణామాలపైన చర్చలు ఊపందుకున్నాయి. కర్ణాటక గెలుపోటములపై ఎవరి లెక్కలు వారేసుకుంటున్నారు. ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపగా.. మరికొన్ని హంగ్ వస్తుందని తేల్చేశాయి. వీటి వల్ల ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో గందరగోళం నెలకొంది. అక్కడ ఫలితాలు ఎలా ఉన్న.. ఆ ప్రభావం రాష్ట్ర రాజకీయాలపైన ప్రభావితం చూపుతుందనే చర్చ జరుగుతోంది.
ఏ రాష్ట్ర రాజకీయాలు ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమవుతాయని.. మరికొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటకలో కమలం వికసిస్తే.. తమకు కలిసి వస్తుందని తెలంగాణ బీజేపీ నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ ఎన్నికలు ముగిసిన వెంటనే.. తెలంగాణపైనే తమ తదుపరి లక్ష్యమని పార్టీ అగ్ర నేతలు గత కొంతకాలంగా చెబుతున్నారు.
ఇప్పుడు ఈ ఫలితాలపైనే : ఈ క్రమంలోనే దక్షిణాదిన సెకండ్ గేట్ వేగా తెలంగాణ కాబోతోందని.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రంలో బీజేపీ బలోపేతం చేరికలపైనే ఆధారపడి ఉందని.. కర్ణాటకలో కమలం గెలిస్తే చేరికలు సైతం ఊపందుకుంటాయని తెలంగాణ నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే అనేక మంది నేతలతో చర్చలు జరిపిన కాషాయదళం.. ఇప్పుడు ఈ ఫలితాలపైనే.. వీరందరి రాక ఆధారపడి ఉందని చెబుతున్నారు.
తెలంగాణలో పార్టీకి పెద్దగా నష్టం ఉండదన్న అభిప్రాయం : కర్ణాటకలో బీజేపీ అధికార పగ్గాలు చేపడితే.. నేతలంతా పార్టీలో చేరేందుకు క్యూ కడతారని యోచిస్తున్నారు. అక్కడ కమలం అధికారంలోకి వస్తే ఇక్కడ కాంగ్రెస్కు గడ్డు పరిస్థితులు ఎదురుకావడం ఖాయమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక బీజేపీ కర్ణాటకలో ఓడిపోతే ఏంటి పరిస్థితి అన్న దానిపైనా రాష్ట్ర నాయకుల్లో చర్చ జరుగుతోంది. అక్కడ హంగ్ వచ్చినా.. కాంగ్రెస్ పార్టీ వచ్చినా.. తెలంగాణలో పార్టీకి పెద్దగా నష్టం ఉండదన్న అభిప్రాయంతో ఉన్నారు.