Karnataka Results Impact on Telangana Politics : కర్ణాటకలో వెలువడనున్న ఓటరు తీర్పు.. తెలంగాణలో కాక రేపుతోంది. ఫలితాల సరళి మూడు ప్రధాన పార్టీలకు ఉత్కంఠగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగైదు నెలలే ఉండటంతో అక్కడి గెలుపు తెలంగాణలో నూతనోత్సాహాన్ని నింపుతుందని బీజేపీ, కాంగ్రెస్‌లు భావిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ తమవైపే మొగ్గు చూపుతుండటంతో విజయం తమదేనని కాంగ్రెస్ ధీమాగా ఉంది.
కర్ణాటకలో గెలుపుతో తెలంగాణలో దూకుడుగా ముందుకెళ్లొచ్చని పీసీసీ నాయకత్వం అంచనా వేస్తోంది. దీంతో తెలంగాణలో బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీను దీటుగా ఎదుర్కొంటామని భావిస్తోంది. సొంత పార్టీ నుంచి వలసలు తగ్గి గాంధీభవన్ వైపు చూసే వారి సంఖ్య పెరుగుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కేసీఆర్‌పై పోరాటానికి దిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరుతారని భావిస్తున్నారు.
గెలుపుపై కాంగ్రెస్ ధీమా..: తెలంగాణలో మాత్రమే కాకుండా రానున్న సార్వత్రిక సమరానికి ఇది టానిక్‌లా పని చేస్తుందని హస్తం నేతలు అంచనా వేస్తున్నారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడిన పార్టీ శ్రేణులకు కర్ణాటక గెలుపు సరికొత్త ఉత్సాహాన్నిస్తుందని లెక్కలేసుకుంటున్నారు. ఓటరు తీర్పు ఎలా ఉన్నప్పటికీ కర్ణాటక తరహాలో కలిసికట్టుగా సాగాలని తెలంగాణ నేతలు భావిస్తున్నారు. దక్షిణాదిన తెలంగాణలో పాగావేయాలని భావిస్తున్న బీజేపీ.. కర్ణాటక ఫలితాలపై కొండంత విశ్వాసంతో ఉంది. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే కాస్త మొగ్గుచూపినప్పటికీ కర్ణాటకలో విజయం తమదేనని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
karnataka election results 2023 : ఈ విజయంతో తెలంగాణలో దూసుకెళ్లాలని కమలనాథులు భావిస్తున్నారు. అయితే.. రాష్ట్రంలో కాషాయదళం బలోపేతం చేరికలపై ఆధారపడి ఉంది. కర్ణాటకలో బీజేపీ గెలిస్తే చేరికలు సైతం ఊపందుకుంటాయని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే అనేక మంది నేతలతో చేరికలపై చర్చలు జరిపిన బీజేపీ నాయకత్వం.. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై వీరందరి రాక ఆధారపడి ఉందని చెబుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహా బీఆర్ఎస్లోని పలువురు అసంతృప్త నేతలు కర్ణాటకలో బీజేపీ అధికార పగ్గాలు చేపడితే కాషాయ కండువా కప్పుకుంటారని లెక్కలేసుకుంటున్నారు.