Karnataka Results effect on TS Assembly Elections 2023: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పని చేస్తున్న కాషాయ దళం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ప్రణాళిక రూపొందించుకుంది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనే కేంద్ర మంత్రులు, జాతీయ నేతలను తెలంగాణలో సైతం పర్యటించాలని హైకమాండ్ ఆదేశించినట్లు సమాచారం. పలువురు నేతలు కర్ణాటక, తెలంగాణ బోర్డర్‌కు సమీపంలో ఉన్న ఆయా పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా విజిట్ చేసే అవకాశాలున్నాయి.
ఢీ అంటే ఢీ అంటున్న బీజేపీ-కాంగ్రెస్:కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలోనూ పర్యటించడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కర్ణాటక ఎన్నికలు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్యగా మారాయి. అధికారాన్ని కాపాడుకోవాలని బీజేపీ, అధికారం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల మీద ఆధారపడే తెలంగాణలో రాజకీయ పార్టీల భవిష్యత్తు ఆధారపడి ఉంది. రాష్ట్రంలో త్రిముఖంగా ఉన్న రాజకీయం... ఈ ఫలితాలతో ద్విముఖంగా మారే అవకాశం లేకపోలేదు. రాష్ట్రంలో బీజేపీ బలహీనంగా ఉండటంతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే బలమైన అభ్యర్థులు కరువయ్యారు.
కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది: ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్‌తో బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన బలమైన నేతలను పార్టీలో చేర్చుకోవడంలో కమలనాథులు సఫలీకృతమయ్యారు. కొన్ని స్థానాలకు అభ్యర్థులు దొరికిన చాలా చోట్ల లేని పరిస్థితి. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే ఆ ప్రభావం తెలంగాణపైన చూపిస్తుందని రాష్ట్ర నాయకత్వం విశ్వసిస్తోంది. బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని భావిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు, సీనియర్లు, జూనియర్లుగా విడిపోయి ఎడమోహం పెడ మోహంగా పని చేస్తున్నారు. ఈ ఫలితాలతో కాంగ్రెస్‌లోని అసంతృప్త సీనియర్ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీ గూటికి వస్తారని ధీమా వ్యక్తం చేస్తోంది.