Karnataka Results Impact on Telangana Politics :కర్ణాటక ఎన్నికల ఫలితాలు.. రాష్ట్ర రాజకీయాలపైన ఎంతో కొంత ప్రభావం చూపనుంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చి.. ఎటువైపు వెళ్లాలా అనే ఆలోచనలో ఉన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఎటువైపు మొగ్గు చూపుతారన్న చర్చ మొదలైంది. వీరిని చేర్చుకునేందుకు గత కొంతకాలంగా అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుండగా.. వీరిద్దరూ వాయిదా వేస్తూ వచ్చారు.
Karnataka Results Impact On TS :ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. త్వరలోనే తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని వారి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారని.. కొన్ని రోజులుగా ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడంతో వారి అడుగులు ఎటు పడతాయనేది చర్చనీయాంశంగా మారింది.
ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని చేర్చుకునేందుకు ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీ చేరికల కమిటీ ఏర్పాటు చేసింది. ఈటలతో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు తదితరులు ఖమ్మం వెళ్లి పొంగులేటి, జూపల్లిలతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించినా.. నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం కావాలని వారు పేర్కొన్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నాయకులు కూడా వీరిద్దరితో చర్చించారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ప్రతినిధులు కూడా చర్చించినట్లు తెలిసింది. వనపర్తి జిల్లా పరిషత్ ఛైర్మన్ లోకనాథరెడ్డి, మరికొందరు నాయకులు ఇటీవల అధికార పార్టీ నుంచి బయటకు వచ్చారు. వీరితో ఇవాళ వనపర్తిలో జూపల్లి, పొంగులేటిలు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు..: రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు మరో నాలుగైదు నెలల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలకు పార్టీలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడానికి తక్కువ సమయమే ఉంది. అధికార బీఆర్‌ఎస్ ఎన్నికలకు పూర్తిస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకులందరికీ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తుండగా.. కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కొన్నిచోట్ల ఫలానా ఎమ్మెల్యేను మళ్లీ గెలిపించండని కూడా కోరుతున్నారు.