తెలంగాణ

telangana

ETV Bharat / state

నదులు గలగల... జలాశయాలకు జలకళ - annaram

ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. భారీగా వస్తున్న వరద ప్రవాహంతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. నిండుకుండలా మారిన ఆల్మట్టి నుంచి నారాయణపూర్​, జూరాల మీదుగా శ్రీశైల మల్లన్న పాదాలను తాకింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

నదులు గలగల... జలాశయాలకు జలకళ

By

Published : Aug 2, 2019, 12:08 AM IST

రాష్ట్రంలో జలాశయాలకు నీటి ప్రవాహం పోటెత్తుతోంది. పరవళ్లు తొక్కుతూ... రాష్ట్రానికి కృష్ణమ్మ చేరుకుంది. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి లక్షా 50వేల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 110.15 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 2 లక్షల 13వేల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు.

నారాయణపూర్​కి భారీగా ప్రవాహం

నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 31.81టీఎంసీల నీటి నిల్వ ఉంది. నారాయణపూర్​కు లక్షా96వేల క్యూసెక్కులకు పైగా నీరు చేరుతుండగా... లక్షా 97వేలకుపైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ నుంచి జూరాలలోకి భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 9.07 కు చేరింది. జూరాల జలాశయంలోకి 1లక్షా85 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా... లక్షా 80వేలకుపైగా క్యూసెక్కుల్ని దిగువకు వదులుతున్నారు.

మల్లన్న పాదాలను తాకిన కృష్ణమ్మ

జూరాల నుంచి కృష్ణమ్మ శ్రీశైలానికి పరుగులు పెడుతోంది. శ్రీశైలం జలాశయంలోకి లక్షా73వేల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. 215.81 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలంలో ప్రస్తుతం 40.51 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి విడుదల చేస్తున్న 1600 క్యూసెక్కుల కృష్ణా జలాలు సంగమేశ్వరం చేరుతున్నాయి. క్రమంగా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులోకి కూడా వరద వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా... ప్రస్తుతం126.3 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

గోదావరి పరవళ్లు

ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి 13వేల క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. 20 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎల్లంపల్లిలో ప్రస్తుతం 8టీఎంసీల నిల్వ ఉంది. 3లక్షల 84వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో మేడిగడ్డ బ్యారేజీలోకి పోటెత్తుంది. 85 గేట్లకు... 65 ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం కన్నెపల్లి పంప్​హౌస్​ వద్ద 8, అన్నారం బ్యారేజీ వద్ద 8.7టీఎంసీల నీరు నిల్వ ఉంది. గోదావరి బేసిన్‌లో 612, కృష్ణా బేసిన్‌లో 53 చెరువులు నిండాయి.

నదులు గలగల... జలాశయాలకు జలకళ

ఇదీ చూడండి: భూ నిర్వాసితుల గోడు వినండి: ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

ABOUT THE AUTHOR

...view details