Harishrao review of Kantivelugu program: కంటి సమస్యలతో రాష్ట్రంలోని ప్రజలు ఎవరు బాధ పడకూడదనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమంపై మంత్రి హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కంటి సమస్యలు తొలగించేందుకు మరోసారి జనవరి 18 నుంచి కంటివెలుగు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈసారి కోటిన్నర మందికి పరీక్షలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఈ పరీక్షల్లో 55 లక్షల మందికి కళ్లద్దాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. కంటివెలుగు రెండో దశకు ప్రభుత్వం రూ.200కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో నమోదయ్యేలా ఈసారి అందరూ కృషి చేయాలని కోరారు. కంటివెలుగులో బాగా పనిచేసే వారికి ప్రశంసలు ఉంటాయని, అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని జిల్లాల్లో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా జరిపించడం, సహాయ సిబ్బందికి శిక్షణ తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు.